
భూ సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి
నాగర్‌కర్నూల్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల 30వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎమ్మెల్యేలు డా.వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, డీఎఫ్‌ఓ రోహిత్ గోపిడితో కలిసి భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తుల పరిష్కారం.. ప్రభుత్వ, అసైన్డ్, ఇనామ్ భూముల పరిష్కారం తదితర అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా భూ భారతి దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయకపోతే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందన్నారు. రెవెన్యూ అధికారులు భూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. వాస్తవాలకు భిన్నంగా ఏ అధికారి ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ముందస్తు సమాచారం ఇవ్వాలి..
జిల్లాలో భూ భారతి దరఖాస్తుల పరిష్కారం కోసం నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు తహసీల్దార్లు రోజు ఉదయం 8 గంటలకే గ్రామాలకు వెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఏ గ్రామానికి ఎప్పుడు సందర్శిస్తారనే వివరాలను నియోజకవర్గ ఎమ్మెల్యేకు ముందస్తు సమాచారం చేరవేయడంతో పాటు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించాలని సూచించారు. ప్రతి దరఖాస్తుదారుడి ఫోన్ నంబర్ ఆధారంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేసి.. ఏ గ్రామానికి ఎప్పుడు వస్తున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. గ్రామస్థాయిలోనే భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి పక్కా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులతో నిర్వహించే సమావేశంలో ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేయాలని ఎస్పీకి సూచించారు. నవంబర్ 15వ తేదీ నాటికి 50 శాతం, 30వ తేదీ నాటికి వందశాతం దరఖాస్తులు పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. అనంతరం కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాలోని అటవీ, దేవాదాయ భూముల పరిష్కారంపై రెవెన్యూ, నీటిపారుదల, అటవీశాఖల అధికారులతో మంత్రి చర్చించారు.
● ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. గ్రామాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న భూ తగాదాల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో గ్రామ పెద్దలను భాగ్యస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల పరిష్కారంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
● ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలతో పాటు కొట్ర గ్రామంలో నాలుగు లైన్ల రహదారికి భూ సేకరణ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి సూచనల మేరకు భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నవంబర్ 30వ తేదీలోగా దరఖాస్తులన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో భూ సమస్యల పరిష్కారంపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదన్నారు. తాను కూడా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపడతానని తెలిపారు. రెవెన్యూ అంశాలపై పురోగతి సాధించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు ఉన్నారు.
గ్రామాల వారీగా భూ భారతి
దరఖాస్తులను పూర్తిచేయాలి
ఉదయం 8గంటలకే తహసీల్దార్లు గ్రామాల్లో ఉండాలి
నవంబర్ 30 వరకు ఒక్క అర్జీ కూడా పెండింగ్‌లో ఉండొద్దు
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు