డిజిటల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. మంగళవారం నాగనూల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జీసీడీఓ శోభారాణితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీలో విద్యార్థినులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, భోజన వసతులను పరిశీలించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఖాన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం డిజిటల్ తరగతులను పక్కాగా బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కేజీబీవీలో చదువుతున్న విద్యార్థినులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థినులకు అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి.. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాబోయే ఇంటర్మీడియట్, ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా విద్యార్థినులు ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా చదవాలని సూచించారు.


