అమరుల త్యాగాలు మరవలేనివి
● శాంతి భద్రతల పరిరక్షణ కోసంనిరంతర కృషి
● కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసులు లేని సమాజాన్ని ఎవరూ ఊహించలేరని.. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో ఎందరో పోలీసులు అమరులయ్యారని.. విధి నిర్వహణలో అశువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపానికి వారితో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాంతి భద్రతలు స్థిరంగా ఉంటేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్ధవంతంగా చేరుతాయన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. విపత్తులు, పండుగలు, ఎన్నికలు వంటి అన్ని సందర్భాల్లో పోలీసులు ముందుండి సేవలందిస్తున్నారని.. వారి సేవలు, త్యాగాలు అమూల్యమైనవని అన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పోలీసుశాఖ కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
● ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశాభివృద్ధికి శాంతి, స్థిరత్వం, సామాజిక సమైక్యత అవసరమని.. పోలీసు వ్యవస్థ వాటిని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులకు సాయుధ దళాలు సంప్రదాయ స్మృతి పరేడ్ నిర్వహించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఆర్‌ఐ ప్రశాంత్‌యాదవ్ దేశవ్యాప్తంగా వివిధ సంఘటనల్లో అమరులైన 191 మంది పోలీసుల జాబితాను కలెక్టర్‌కు అందజేయగా.. అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అమరుల పేర్లను చదివి వినిపించారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు అమరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తూ కంటతడి పెట్టుకున్నారు. తమ వారిని గుర్తు చేసుకుంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. అనంతరం పట్టణ పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డి, సీఐలు అశోక్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


