అంబరాన్నంటిన దీపావళి సంబరాలు
కందనూలు: జిల్లావ్యాప్తంగా సోమవారం దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. వాణిజ్య, వ్యాపార దుకాణాలతో పాటు నివాసగృహాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించి లక్ష్మీపూజలు నిర్వహించారు. ఇంటిల్లిపాది వివిధ ఆకృతుల్లో దీపాలను వెలిగించి.. పూలతో అందంగా అలంకరించారు. కొందరు గౌరీ నోములు, కేదారేశ్వరస్వామి వ్రతాలు ఆచరించారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు టపాసుల మోతలతో విధులన్నీ మార్మోగాయి. జిల్లా కేంద్రంలోని రామస్వామి, వేంకటేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది.


