‘ఉపాధి’కి ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి ప్రణాళికలు

Oct 22 2025 9:52 AM | Updated on Oct 22 2025 9:52 AM

‘ఉపాధి’కి ప్రణాళికలు

‘ఉపాధి’కి ప్రణాళికలు

నాగర్‌కర్నూల్‌: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి.. ఉన్న ఊరిలోనే కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేఽశంతో ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టాలి.. ఏ పనులకు ప్రాముఖ్యత ఇస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది.. కూలీలకు సరిపడా పనుల గుర్తింపు తదితర అంశాలపై ప్రతి ఏటా గ్రామసభలు నిర్వహించి పక్కా ప్రణాళికలు రూపొందిస్తారు. అందులో భాగంగా 2026–27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పనుల గుర్తింపునకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామసభలు ప్రారంభం కావాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ రావడంతో పనుల గుర్తింపునకు బ్రేక్‌ పడింది. అయితే ఎన్నికలు రద్దు కావడం.. ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయడంతో గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిసెంబర్‌ చివరి నాటికి పనులను గుర్తించి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఉపాధి పనుల గుర్తింపునకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. జిల్లాలోని అన్ని జీపీల్లో పంచాయతీ కార్యదర్శి, రైతులు, గ్రామ ప్రజలు, ఉపాధి హామీ సిబ్బందితో గ్రామసభలు ఏర్పాటుచేసి.. పనుల ప్రణాళికలను తయారు చేయాల్సి ఉంటుంది. శ్మశానవాటికల నిర్మాణం, ఇంకుడుగుంతలు, పశువుల షెడ్లు, నీటితొట్ల ఏర్పాటు, కల్లాల నిర్మాణం, నర్సరీల ఏర్పాటు, చెక్‌డ్యాంలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, కాల్వల్లో పూడికతీత తదితర పనులను గుర్తించి.. మండల కార్యాలయానికి నివేదించాల్సి ఉంటుంది. పనుల గుర్తింపు ప్రకారం కావాల్సిన బడ్జెట్‌ కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులను మంజూరుచేసే అవకాశం ఉంటుంది.

2025–26లో ఇలా..

జిల్లాలోని 461 గ్రామపంచాయతీల్లో 1,94,211 జాబ్‌కార్డులు ఉండగా.. అందులో యాక్టివ్‌ జాబ్‌ కార్డులు 1,05,632 ఉన్నాయి. మొత్తం 3,72,745 మంది కూలీలు ఉండగా.. రెగ్యులర్‌గా పనిచేసే కూలీలు 1,73,007 మంది ఉన్నారు. 2025–26 సంవత్సరానికి ఇప్పటి వరకు 70.31 శాతం పనిదినాలను పూర్తిచేశారు. ఇందుకోసం రూ. 42.90కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల ఖర్చు రూ. 34.48 కోట్లు కాగా.. సామగ్రి కోసం రూ. 8.42కోట్లు వెచ్చించారు. సరాసరి ఒక్కో కూలీకి రూ. 243 చెల్లించారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి ఉపాధి పనుల గుర్తింపు కోసం డిసెంబర్‌ నెలాఖరు వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. గతంలో పనిదినాల లక్ష్యం 60 నుంచి 75శాతం వరకు మాత్రమే పూర్తిచేయగా.. ఈ ఏడాది ఇప్పటికే 70.31శాతం పూర్తిచేశారు.

నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేస్తాం..

2026–27 సంవత్సరానికి సంబంధించి పనుల గుర్తింపు ప్రక్రియ ఈ వారంలో ప్రారంభమవుతుంది. ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి పనులను గుర్తిస్తాం. డిసెంబర్‌ చివరి నాటికి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పనులను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేస్తాం. ఈ సంవత్సరానికి సంబంధించి నిర్దేశిత లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తిచేస్తాం.

– చిన్న ఓబులేషు, డీఆర్డీఓ

2026–27 సంవత్సరానికి పనుల గుర్తింపునకు గ్రామసభలు

డిసెంబర్‌ చివరి నాటికి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కసరత్తు

2025–26లో

70.31శాతం పనులు పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement