వీధి వ్యాపారం.. అభివృద్ధికి రుణం | - | Sakshi
Sakshi News home page

వీధి వ్యాపారం.. అభివృద్ధికి రుణం

Oct 17 2025 8:20 AM | Updated on Oct 17 2025 8:20 AM

వీధి వ్యాపారం.. అభివృద్ధికి రుణం

వీధి వ్యాపారం.. అభివృద్ధికి రుణం

పీఎం స్వనిధి పథకం ద్వారా లోక్‌ కల్యాణ్‌ మేళా

అచ్చంపేట: వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి.. వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో కామన్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌(సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాను ఆదేశించగా క్షేత్రస్థాయిలో అధికారులు వివరాలు సేకరించి సిద్ధం చేశారు.

జిల్లాలో 6,061 మంది..

వీధి వ్యాపారులకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఇది వరకు 6,061 మంది వీధి వ్యాపారులను గుర్తించగా పీఎం స్వనిధి పథకం కింద 5,296 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించగా.. గత పది నెలలుగా నిలిచిపోయింది. ఈ పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ అదే స్థానంలో తాజాగా లోక్‌ కల్యాణ్‌ మేళా తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు మహిళా సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. కొత్త టార్గెట్‌ 162 మంది ఉండగా ఇప్పటి వరకు 140 పూర్తి చేశారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో ఇప్పటికే కొంతమంది వీధి వ్యాపారులకు ఒకటి, రెండు విడతలుగా రుణాలు అందించగా.. ప్రస్తుతం మూడో విడత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 77 కామన్‌ గ్రూపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 20 గ్రూపులను ఏర్పాటు చేశారు.

రుణ సదుపాయం పెంపు

ఐదేళ్ల కిందట వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించారు. వడ్డీ వ్యాపారులతో ఇబ్బందులు గురికాకుండా బ్యాంకుల ద్వారా నేరుగా స్వల్పకాలిక రుణాలు అందజేశారు. వందల సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు తీసుకొని చెల్లించడంతో ఎక్కువ మొత్తంలో రుణం పొందడానికి అర్హత సాధించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసిన పాత వారితోపాటు కొత్త సంఘాల సభ్యులకు కూడా రుణాలు పొందే అవకాశం కల్పించారు. మొదటి విడతలో రూ.10 వేలు అందించగా.. ఇప్పుడు లోక్‌ కల్యాణ్‌ మేళా ద్వారా రుణాన్ని రూ.15వేలకు పెంచారు. రెండో విడతలో రూ.20 వేలు అందించగా ప్రస్తుతం రూ.25 వేలకు పెంచారు. మొదటి, రెండు విడతల్లో సక్రమంగా చెల్లించిన వారిని ఎంపిక చేసి రూ.50 వేల రుణం ఇవ్వనున్నారు.

నాలుగు మున్సిపాలిటీల్లో..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొదటి విడత మొత్తం 6,061 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వీరితో ఏర్పాటు చేసే గ్రూపుల్లో ఎంపిక చేసిన సంఘాల్లోని సభ్యులకు ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. వారు బ్యాంకు ఖాతా తెరిచిన వెంటనే సంఘాల పొదుపు ప్రక్రియ పరిశీలించి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించనున్నారు. ఆరు నెలల తర్వాత సంఘాలకు మొదటి విడతగా రూ.లక్ష, తర్వాత రూ.3– 5 లక్షలు, సకాలంలో చెల్లిస్తే రూ.10–15 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే వీధి వ్యాపారులు ప్రత్యేకంగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా దుకాణాలు నిర్మించునున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ముందు 36 రేకుల షెడ్లు నిర్మించారు. కల్వకుర్తిలో 63 షెడ్లు నిర్మించినా ఇంత వరకు ఎవరికీ కేటాయించలేదు. అచ్చంపేట, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో సైతం వీటిని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.

సభ్యులకు బీమా సదుపాయం

పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన వ్యాపారులకు రూ.2 లక్షల బీమా సదుపాయం కల్పించనున్నారు. ప్రమాదవశాత్తు సభ్యులు మరణిస్తే వారికి బీమా వర్తిస్తుంది. ఈ మేరకు వీధి వ్యాపారులకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో గుర్తింపు కార్డులు అందజేశారు. దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వీధి వ్యాపారులతో పట్టణ వ్యాపారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ చైర్మన్‌గా మున్సిపల్‌ కమిషనర్‌ ఉంటారు.

పాతవారితోపాటు కొత్త సంఘాల సభ్యులకు రుణాలు

ఇప్పటికే అవగాహన సదస్సులు

నిర్వహించిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement