
అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే కఠిన చర్యలు
నాగర్‌కర్నూల్: అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఎక్కడైనా అనర్హులకు ఇళ్లు మంజూరు చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నా.. పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ సంకల్పం మేరకు ఇళ్లను మంజూరు చేశామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మంజూరైన వారంతా ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని, అవసరమైతే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ కింద రుణం అందించేలా చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ అశోక్, హౌసింగ్ పీడీ సంగప్ప, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, పీఆర్‌ఈఈ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తపాలా ద్వారా ఓటరు కార్డులు
కొత్తగా నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ సహకారంతో పంపిణీ చేయాలని కలెక్టర్ తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఓటరుకు గుర్తింపు కార్డు అందించడమే కాకుండా, ఎన్నికల జాబితాలో ఉన్న పొరపాట్లు సవరించేందుకు, పారదర్శకతను కాపాడేందుకు జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీలు పనిచేస్తాయని చెప్పారు. వీసీలో ఆర్డీఓలు సురేష్‌బాబు, మాధవి, భన్సీలాల్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.