
ట్రాన్స్‌ఫార్మర్ కోసం లంచం
వంగూరు: మితిమీరిన అవినీతికి పాల్పడుతూ రైతులను, విద్యు త్ వినియోగదారులను పీల్చి పిప్పి చేస్తున్న విద్యుత్ శాఖ లైన్‌మన్ నాగేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాన్స్‌ఫార్మర్ కావాలని నాలుగు నెలల క్రితం నాలుగు డీడీలకు డబ్బులు చెల్లించాడు. అయితే ట్రాన్స్‌ఫార్మర్ బిగించడంలో లైన్‌మన్ నాగేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నిత్యం ట్రాన్స్‌ఫార్మర్ కోసం లైన్‌మన్‌ను కలవగా నాలుగు డీడీలకు రూ.20 వేలు అయినప్పటికీ అదనంగా రూ.10 వేలు తీసుకున్న లైన్‌మన్ సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వకుండా మరో రూ.20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు వంగూరు గ్రామ శివారులోని మద్యం దుకాణం ఎదుట రైతు రూ.15 వేల నగదునాగేందర్‌కు ఇస్తుండగా సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకుని విద్యుత్ కార్యాలయానికి తరలించారు. నాగేందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, జిలానీ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను డీఎంఎల్‌టీ, డీఈసీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.మహబూబ్‌ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణులై తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు. బైపీసీ అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో ఇతర గ్రూపుల అభ్యర్థులను సైతం పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ప్రభుత్వ సంస్థ ప్రిన్సిపాల్ ద్వారా ఎంపిక విధానం ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు tgpmh. telangana.gov.in వెబ్‌సైట్‌ల లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల జిరాక్స్ దరఖాస్తు ఫారానికి జతచేసి సంబంధిత అధికారికి ఈ నెల 28వ తేదీలోగా అందజేయాలని సూచించారు.
● ఏసీబీకి చిక్కిన లైన్‌మన్ నాగేందర్
● రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత