
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసుశాఖ కృషి చేస్తుందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కోసం మంగళవారం పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌లో పురోగతి సాధించేందుకు హైదరాబాద్ తరహాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా శ్రీపురం చౌరస్తా, బస్టాండ్ ప్రాంతంతో పాటు పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.
బాధితులకు అండగా ఉంటాం..
వివిధ సమస్యలపై పోలీసుల వద్దకు వచ్చే బాధితులకు అండగా నిలిచి సత్వర న్యాయం చేకూరేందుకు కృషి చేస్తామని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 126 మంది ఫోన్లు పోగొట్టుకోగా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. వీటి విలువ రూ. 20లక్షలు ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు చోరీకి గురైనా, పోగొట్టుకున్నా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో లేదా సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులో వచ్చినప్పటి నుంచి జిల్లాలో 4,487 ఫిర్యాదులు వచ్చాయని.. వీటిలో 1,631 మందికి ఫోన్లు రికవరీ చేసి అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ గోవర్ధన్, ట్రాఫిక్ ఎస్‌ఐ కళ్యాణ్, ఎస్‌బీ ఎస్‌ఐ పర్వతాలు పాల్గొన్నారు.