
సీతారాముల మాస కల్యాణోత్సవం
చారకొండ: పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆదివారం సీర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి దేవాలయంలో స్వామి వారి మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో కల్యాణ మండపం అలంకరించి, ఆలయ అర్చకులు మంత్రోచ్ఛరణల నడుమ మాస కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని జూపల్లి గ్రామానికి చెందిన రంగినెని విజయమనోహర్ రావు దంపతులు, హైదరాబాద్‌కు చెందిన దుర్శనపల్లి ప్రీతం కావ్వ దంపతులు స్వామివార్ల కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు ఉన్నారు.
జిల్లాలో మోస్తరు వర్షం
కల్వకుర్తి టౌన్: జిల్లాలో ఆదివారం పలుచోట్ల చిరుజల్లులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. చిరుజల్లులతో కురిసిన వర్షానికి ప్రజలు బయటకు వెళ్లి పనులు చేసుకోకుండా మారింది. జిల్లాలో అత్యధికంగా కల్వకుర్తిలో 31.3 మి.మీ., వర్షం కురవగా.. అత్యల్పంగా బల్మూర్ మండలంలోని కొండనాగులలో 25.8 మి.మీ., వర్షపాతం నమోదైంది. ఊర్కొండలో 30.9, ఉప్పునుంతలలో 30.7, వంగూరులో 30.5, తెలకపల్లిలో 30.2, తిమ్మాజిపేటలో 30.0, వెల్దండలో 29.8, అచ్చంపేటలో 29.8, తాడూరులో 29.7, లింగాలలో 29.6, బల్మూరులో 29.1, చారకొండలో 29.1, కోడేరులో 29.1, పెద్దకొత్తపల్లిలో 29.0, కొల్లాపూర్‌లో 28.9, పెంట్లవెల్లిలో 28.7, బిజినేపల్లిలో 28.6, అమ్రాబాద్‌లో 28.3, పదరలో 27.7, నాగర్‌కర్నూల్‌లో 27.3 మి.మీ., వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు ఇలాగే చిరుజల్లులతోపాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. గత కొన్నిరోజులుగా కురుస్తున్న ముసురు, భారీ వర్షాలతో ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే పత్తి పంటలో రోజుల తరబడిగా నీరు నిలిచి తెగుళ్లు ఆశిస్తుండగా ఇతర పంటల పరిస్థితి సైతం అలాగే మారింది.

సీతారాముల మాస కల్యాణోత్సవం