
‘ఇన్‌స్పైర్’ కావట్లే..
కందనూలు: చిన్నారుల ఆలోచనలకు సరికొత్త రూపు ఇవ్వడానికి.. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాల వైపు మళ్లించి.. వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో శాస్త్ర, సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతి ఏడాది ఇన్‌స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తోంది. అయితే దీనికి జిల్లాలో ఆశించిన మేర స్పందన రావడం లేదు. జూలై 1న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ సోమవారంతో ముగియనుండగా కేవలం 640 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 895 దరఖాస్తులు రావడం గమనార్హం. కాగా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారంలోగా ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో నామినేట్ చేయడానికి అవకాశం ఉంది.
కనీసం 5 దరఖాస్తులు
జిల్లావ్యాప్తంగా 125 ప్రాథమికోన్నత, 131 ఉన్నత, 156 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అయితే అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. వన్‌టైం రిజిస్ట్రేషన్‌లో భాగంగా విద్యాలయాల వివరాలు పొందుపర్చాలి.
ప్రతిభను వెలికి తీసేందుకే..
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి ఇన్‌స్పైర్ మనక్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలు ఆహ్వానిస్తారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 10 లక్షల ఆలోచనలు ఆహ్వానించి అందులో పది వేల ఆలోచనలను రాష్ట్రస్థాయికి, వెయ్యి ఆలోచనలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. తుది విడతలో 60 ఆలోచనలను రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. ఆయా దశల్లో కొనసాగే ఈ ప్రక్రియలో వేలాది మంది విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుంది.
పలు అంశాలపై ప్రాజెక్టులు..
స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, సమాజాభివృద్ధి, గణితం, సైన్స్ తదితర అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించాలి. జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపికై న నమూనాను ప్రదర్శించడానికి రూ.10 వేలను ప్రోత్సాహకంగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. జిల్లాస్థాయిలో ఎంపికై తే వాటిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులను మరింత మెరుగైన విధంగా తయారు చేయడానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మరో రూ.25 వేలు ఇస్తుంది. జాతీయ స్థాయిలో ప్రతిభచూపిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్‌లో అభినందనలు, ఆతిథ్యంతోపాటు పేరొందిన శాస్త్రవేత్తలను కలిసే అవకాశం కల్పిస్తారు.
విద్యార్థులను ప్రోత్సహించాలి..
ఎక్కువ మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను ప్రోత్సహించాలి. కానీ, వారి నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 640 మాత్రమే నమోదయ్యాయి. ప్రతిరోజు హెచ్‌ఎంలు, సైన్స్ ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం. – రాజశేఖర్‌రావు, జిల్లా సైన్స్ అధికారి
ప్రైవేట్ పాఠశాలల అనాసక్తి..
ప్రస్తుత కాలంలో ర్యాంకులతో పోటీ పడుతున్న ప్రైవేటు పాఠశాలలు ఇలాంటి సృజనాత్మక విషయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వారికి ర్యాంకులే పరమావధిగా విద్యాబోధన కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో కొంత మెరుగ్గా ఉన్నా.. ప్రైవేటు పాఠశాలల నుంచి మాత్రం విద్యార్థులకు ప్రోత్సాహం కనిపించడం లేదు. విద్యాశాఖ అధికారులు ఎన్నిసార్లు వారికి తెలియజేసినా ముందుకు రాకపోవడం గమనార్హం.
జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నది 640 మందే..
జూలై 1న ప్రారంభం.. నేటితో ముగియనున్న గడువు
ప్రతి పాఠశాల నుంచి 5 చొప్పున రావాలని సూచన
క్షేత్రస్థాయిలో కనిపించని ఆశించిన ఫలితాలు
ర్యాంకులే పరమావధిగా
వ్యవహరిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు