
నేడు జిల్లాలో మంత్రుల పర్యటన
నాగర్‌కర్నూల్: జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు మాడ్గుల మండల కేంద్రంలో రూ. 12.70కోట్లతో 30 పడకల ఆస్పత్రి భవనం, 10:15 గంటలకు కోనాపూర్ నుంచి మాడ్గుల గుండా దేవరకొండ రోడ్డు వరకు రూ. 70కోట్లతో చేపట్టే బీటీరోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 220 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి.. 11:45 గంటలకు వెల్దండకు చేరుకుంటారు. అక్కడ వెల్దండ – సిర్సనగండ్ల వరకు రూ. 40కోట్లతో నిర్మించే బీటీరోడ్డుకు, కల్వకుర్తి నుంచి కొట్ర గేట్ మీదుగా తలకొండపల్లి వరకు 22 కి.మీ. మేర రూ. 65కోట్ల వ్యయంతో నిర్మించే బీటీరోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2గంటలకు కల్వకుర్తికి చేరుకొని రూ. 45.50కోట్లతో 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకొని మెడికల్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే 550 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.
విద్య, వైద్యంలో జిల్లాను అగ్రభాగాన
నిలపడమే లక్ష్యం
విద్య, వైద్యరంగాల్లో జిల్లాను అగ్రభాగాన నిలపడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లాలో మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రూ. 9కోట్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో వట్టెంలో నూతన పాఠశాల భవనం నిర్మిస్తామన్నారు. రూ. 200కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సముదాయం టెండర్ దశలో ఉందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పనులను పూర్తిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో ఉన్న 100 పండకల ఆస్పత్రిని 330 పడకలకు పెంచడం జరిగిందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో నూతన నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రుల పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్లు నిజాం, సునేంద్ర, జక్కా రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,
శంకుస్థాపనలు
చేయనున్న అమాత్యులు
ఏర్పాట్లు పూర్తిచేసిన
అధికార
యంత్రాంగం