
ఆధారాల సేకరణలో సీసీ కెమెరాలు కీలకం
బిజినేపల్లి: రోడ్డు ప్రమాదాలు, మహిళలపై వేధింపులు, చోరీలు వంటి నేరాలకు సంబంధించిన ఆధారాల సేకరణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మండలంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను బుధవారం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం వైర్‌లెస్ సీసీ కెమెరాలు వచ్చాయని.. వ్యాపార దుకాణాల వద్ద, రద్దీ ప్రదేశాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరస్తుల్లోనూ భయం పెరుగుతుందన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రధాన బాధ్యతగా తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజల సురక్షిత జీవనానికి పోలీసుశాఖ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక వనరులు సమకూర్చేందుకు తనవంతు సహకారం అందిస్తా నని తెలిపారు. కాగా, నందివడ్డెమాన్‌కు చెందిన తి ప్పిరెడ్డి రాంచంద్రారెడ్డి తదితర ఎన్‌ఆర్‌ఐల సామా జిక బాధ్యతగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించారని ఎస్పీ తెలిపారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో డీఏస్పీ శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.