
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
కల్వకుర్తిరూరల్: స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది అన్నివిధాలా సన్నద్ధం కావాలని ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. కల్వకుర్తి పట్టణంలో మంగళవారం బూత్‌స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచ తప్పనిసరిగా పాటిస్తూ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్ముద్ షేక్, తహసీల్దార్ ఇబ్రహీం, ఎన్నికల డీటీ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.