
అభివృద్ధిలో కందనూలు ముందడుగు
నాగర్‌కర్నూల్: జిల్లాలో ప్రజల జీవన నైపుణ్యాలు పెంచేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అభివృద్ధిలో కందనూలు జిల్లా ముందడుగు వేస్తోందన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ చాంబర్‌లో తెలంగాణ దర్శన్‌లో భాగంగా 2024 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లు సలోని చబ్రా, హర్ష్ చౌదరి, కరోలియన్ చింగ్ తిన్నవి, కొయ్యడ ప్రణయ్‌కుమార్ కలెక్టర్‌తోపాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌లను కలిశారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న చెంచుల జీవన విధానం, విద్య, వైద్యం, ఆదాయ వనరుల నిర్వహణ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో, పీహెచ్‌సీలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రైతువేదికలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పర్యటనలో ఎదురైన విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమగ్రంగా వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, రైతు రుణమాఫీ, గిరిజన రైతులకు ప్రత్యేక పథకాల విధానం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి అంశాలను స్పష్టంగా చెప్పారు. నల్లమల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న చెంచు, గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాల గురించి అవగాహన కల్పించారు. చెంచులు వారి సంప్రదాయ జీవనశైలిని కొనసాగిస్తూనే ఆధునిక వసతులు అందుకునేలా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతుందన్నారు. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి రంగాల్లో సమగ్ర మద్దతు అందించేందుకు గిరిజన అభివృద్ధి సంస్థల ద్వారా పలు పథకాలు అమలవుతున్నాయన్నారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు, పోషకాహారం వంటి వసతులు విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తేనె, వన ఉత్పత్తుల సేకరణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ, చిరుధాన్యాల సాగు వంటి మార్గాలతో వారి ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.