
ఖాతాదారులు టెక్నాలజీని వినియోగించుకోవాలి
తిమ్మాజిపేట: ఖాతాదారులు ఎప్పటికప్పుడు సాంకేతికతను వినియోగించుకొని బ్యాంకు సేవలు పొందాలని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆవంచలో శనివారం ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్యాంకులో డబ్బులు జమ చేసుకోవాలన్నా.. డబ్బులు తీసుకోవాలన్న మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా సాంకేతికతను వినియోగించుకొనే అవకాశం ఉందన్నారు. ఖాతదారులు సామాజిక భద్రత పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, సురక్ష జీవన బీమా, అటల్ పెన్షన్ యోజన పథకాలలో అర్హులైన వారు భాగస్వాములు కావాలని కోరారు. ఏడాదికి రూ.2 వేలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.40 లక్షలు వస్తాయన్నారు. ఏటీఎం, రూపే కార్డులను వినియోగించుకొని సమయం వృథా కాకుండా చేసుకోవాలన్నారు. మోసపూరిత ఫోన్ కాల్స్ ఆందోళన చెందవద్దని, ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. రైతులు, ఖాతాదారులు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకు అందించే సేవలు, సౌకర్యాల గురించి వివరించారు.