
ఎన్నాళ్లీ కష్టాలు
కొల్లాపూర్: కేఎల్‌ఐ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఆ గ్రామాలు సాగునీటికి నోచుకోవడం లేదు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి సాగునీటి కోసం ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులను వేడుకుంటూనే ఉన్నా.. కానీ, వారి కోరిక మాత్రం నెరవేరడం లేదు. ఇది కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, మొలచింతలపల్లి గ్రామాల పరిస్థితి. దీంతో నేటికీ ఆయా గ్రామాల రైతులు వర్షాధారంగా.. మరికొందరు బోరుబావులు తవ్వుకొని పంటలు సాగుచేస్తున్నారు. అయితే రెండు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న జీల్దార్‌తిప్ప చెరువుకు కేఎల్‌ఐ నీటిని మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా జరిగితే రెండు గ్రామాలకు సాగునీటి సమస్య తీరడంతోపాటు నల్లమల అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు శాశ్వతంగా తాగునీటి వనరులు అందుబాటులో వస్తాయి.
ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో..
కేఎల్‌ఐ ప్రాజెక్టుకు కేవలం 3 కి.మీ., దూరంలోనే మొలచింతపల్లి, 6 కిలోమీటర్ల దూరంలో ముక్కిడిగుండం గ్రామాలు ఉంటాయి. వీటికి అనుబంధ గ్రామాలు సైతం ఉన్నాయి. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో ఈ గ్రామాలు ఉండడంతో కేఎల్‌ఐ నీటిని ఆయా శివార్లకు తరలించేందుకు అధిక మొత్తంలో ఖర్చవుతుందని అధికారులు పట్టించుకోలేదు. తర్వాతి కాలంలో ప్రజల నుంచి డిమాండ్లు పెరగడంతో పాలకులు రెండు గ్రామాలకు సాగునీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. పనుల కోసం శిలాఫలకాలు వేసినా.. కానీ, పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
చెరువులు, బోరు బావులే..
మొలచింతలపల్లి, ముక్కిడిగుండం రెవెన్యూ శివార్లలోని భూముల సాగుకు చెరువులు, బోరుబావులే దిక్కయ్యాయి. ప్రధానంగా జీల్దార్‌తిప్ప చెరువు కిందనే అధిక ఆయకట్టు ఉంది. ఈ చెరువును 1970లో అప్పటి కొల్లాపూర్ ఎమ్మెల్యే కె.రంగదాసు నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించారు. 2 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా నిర్మించిన ఈ చెరువును మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ్‌రావు ప్రారంభించారు. చెరువు కింద ప్రస్తుతం దాదాపుగా 1,800 ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీరు సమృద్ధిగా ఉంటే 3 వేల ఎకరాల మేర ఆయకట్టు సాగవుతుంది. వర్షాకాలంలో చెరువు నీళ్ల ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులు రబీ సీజన్‌లో మాత్రం సాగునీరు లేక పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారు.
వన్యప్రాణులకూ ఉపయోగమే..
జీల్దార్‌తిప్ప చెరువును ఆనుకొని నల్లమల అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ చెరువును కేఎల్‌ఐ నీటితో నింపితే చెరువు కింద ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందడంతోపాటు నల్లమల అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు శాశ్వతంగా తాగునీటి సౌకర్యం కల్పించినట్లు అవుతుంది. జీల్దార్‌తిప్ప చెరువుకు రెగ్యులర్‌గా తాగునీటి కోసం వన్యప్రాణులు వస్తుంటాయి.
కృష్ణా జలాలకు నోచుకోని జీల్దార్‌తిప్ప చెరువు
కేఎల్‌ఐ చెంతనే ఉన్నా
మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాలకు అందని సాగునీరు
చెరువు కింద 3 వేల ఎకరాలకు
పైగా ఆయకట్టు
సాగునీటి మళ్లింపు కోసం కెనాల్ తవ్వేందుకు ఆరేళ్ల క్రితం శంకుస్థాపన
ఉన్నతాధికారులకు విన్నవిస్తాం..
కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా జీల్దార్‌తిప్ప చెరువుకు నీటిని మళ్లించే అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. ఈ పనులకు రెండుసార్లు నిధుల కేటాయింపు జరిగింది. అయితే భూ సేకరణలో సమస్యల కారణంగా గతంలో పనులు ముందుకు సాగలేదు. నిధుల కొరత కూడా కారణమే. నిధుల కేటాయింపు, భూ సేకరణ సమస్య, అవసరమైన నిధుల వివరాలతో గతంలో సీఈకి నివేదిక పంపించాం. మరోసారి ఉన్నతాఽధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం.
– శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ