
నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం
నాగర్‌కర్నూల్: జిల్లాలో నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తానని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలకు చెందిన 27 మంది విద్యార్థులను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, డీఈఓ రమేష్‌కుమార్ గురువారం సాయంత్రం కలెక్టర్ చాంబర్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు త్వరలోనే ట్యాబులు అందజేస్తామని వెల్లడించారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 96.83 శాతం ఉత్తీర్ణతతో జిల్లాను రాష్ట్రస్థాయిలో 13వ స్థానంలో నిలబెట్టినందుకు విద్యా శాఖ, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల జీవితంలో తొలిమెట్టు అని, అత్యుత్తమ ప్రతిభతో అధిరోహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇకపై ఉన్నత విద్యను కూడా అదే స్థాయిలో అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి తమ జీవిత లక్ష్యాలను సాధించడానికి అవసరమైన వనరులు సమకూర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నోడల్ అధికారి కుర్మయ్య, సెక్టోరియల్ అధికారులు షర్ఫుద్దీన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.