పాఠ్యపుస్తకాలు | - | Sakshi
Sakshi News home page

పాఠ్యపుస్తకాలు

Apr 26 2025 12:19 AM | Updated on Apr 26 2025 12:19 AM

పాఠ్యపుస్తకాలు

పాఠ్యపుస్తకాలు

బడుల ప్రారంభం రోజే..

విడతల వారీగా జిల్లాకు సరఫరా

ఇప్పటికే గోదాంకు

చేరుకుంటున్న పుస్తకాలు

విద్యార్థులకు సకాలంలో

అందించేందుకు విద్యాశాఖ కసరత్తు

మరోవైపు నోట్‌బుక్స్‌ సైతం

ఇచ్చేలా చర్యలు

అచ్చంపేట: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమకూర్చాల్సిన సౌకర్యాలపై విద్యాశాఖ ముందుగానే దృష్టిసారించింది. ఇప్పటికే యూనిఫాంల వస్త్రం బడులకు చేరగా.. దుస్తులు కుట్టేందుకు అందిస్తున్నారు. వచ్చే 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు సైతం జిల్లాకు చేరుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత కొన్ని రాగా.. మిగిలినవి విడతల వారీగా రానున్నాయి. జిల్లాకు చేరిన పుస్తకాలను గోదాంలో భధ్రపరిచారు. జూన్‌లో బడులు తెరుచుకునే నాటికి పూర్తిస్థాయిలో అందించేందుకు ప్రణాళిక రూపొందించారు.

పక్కదారి పట్టకుండా నంబర్లు

పాఠ్య పుస్తకాలు వేసవి సెలవులు ముగిసే వరకు విడతల వారీగా గోదాంకు చేరనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై వరుస క్రమంలో నంబర్లను ముద్రించారు. వీటి ఆధారంగా ఎన్ని మండలాలకు ఏయే పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు వెళ్లాయన్నది అధికారుల రికార్డుల్లో నమోదు చేయనున్నారు.

స్కాన్‌ చేస్తే వీడియో రూపంలో..

ఎంఈఓలు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా వాటిని హెచ్‌ఎంలకు బడుల ప్రారంభం నాటికి పంపిణీ చేసేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. పుస్తకంలో ఒకవైపు తెలుగు, మరోవైపు ఆంగ్ల మాధ్యమంలో పాఠాన్ని 1– 10వ తరగతి విద్యార్థులకు అందిస్తున్నారు. 3– 10 తరగతి వారికి పార్ట్‌–1, పార్ట్‌–2గా పంపిణీ చేయనున్నారు. ఈ విధానంతో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గనుంది. అలాగే పుస్తకాల్లోని ప్రతి పాఠానికి బార్‌కోడ్‌ ముద్రిస్తుండటంతో ఫోన్‌లో స్కాన్‌ చేస్తే ఆ పాఠాన్ని వీడియో రూపంలో విద్యార్థులు చూసుకునే సదుపాయం ఉంటుంది.

నోట్‌బుక్స్‌ అందజేత

1 నుంచి 5వ తరగతి వారికి వర్క్‌ బుక్స్‌, 6 నుంచి 10వ తరగతి వారికి రాత పుస్తకాలు అందించనున్నారు. వీటిని పిల్లలకు ఉచితంగా అందించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది. 5 నుంచి 10వ తరగతి వరకు చదివే ఒక్కో విద్యార్థికి 6 నోట్‌ బుక్స్‌ చొప్పున అందించనున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలతోపాటు నోటుబుక్స్‌ను కూడా ఎంఈఓలు తమ మండలాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

యూడైస్‌ వివరాల ప్రకారం..

జిల్లా, మండల పరిషత్‌, ఎయిడెడ్‌ స్కూళ్లలోని ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు.. కేజీబీవీ, మోడల్‌, ఆదర్శ, ఆశ్రమ పాఠశాలలతోపాటు సంక్షేమ గురుకులాల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేయనున్నారు. కొత్తగా ప్రవేశాలు పొందేవారితోపాటు ప్రస్తుతం చదువుతున్న వారికి పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు ఇవ్వనున్నారు. యూడైస్‌ ప్లస్‌ వివరాల ప్రకారం వీటిలో చదువుతున్న విద్యార్థులకు మొత్తం 5,34,660 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఇటీవల జిల్లా పాఠ్య పుస్తకాల గోదాంకు 1,23,190 పుస్తకాలు చేరుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పంపిణీ చేయకుండా నిల్వగా మరో 25 వేల పాఠ్యపుస్తకాలు గోదాంలో ఉండగా.. ఇంకా 4,11,470 పుస్తకాలు రావాల్సి ఉంది.

గోదాంలో భద్రపరుస్తున్నాం..

జిల్లాకు పాఠ్య పుస్తకాలు చేరుకుంటున్నాయి. వీటిని జిల్లాకేంద్రంలోని గోదాంలో భద్రపరుస్తున్నాం. ప్రస్తుతానికి పార్ట్‌– 1 పుస్తకాలు రాగా.. పార్ట్‌–2కు సంబంధించిన పుస్తకాలు తర్వాత వస్తాయి. గోదాం నుంచి మండలాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తాం. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందిస్తే వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. పుస్తకాలు పక్కదారి పట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

– రమేష్‌కుమార్‌, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement