
గ్రామ గ్రామాన మే డే ఉత్సవాలు
నాగర్‌కర్నూల్ రూరల్: అమరవీరుల స్ఫూర్తితో గ్రామ గ్రామాన మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మేడే ఉత్సవాల ఏర్పాట్లపై భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 139వ మే డే సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్రం 44 కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మీపతి, నాయకులు శివకృష్ణ, పరశురాం తదితరులు పాల్గొన్నారు.