
భూ భారతి
పేదవాడి చుట్టంలా
నాగర్‌కర్నూల్: పేదల భూ సమస్యలు తీర్చే చట్టమే భూ భారతి అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయానికి హెలికాప్టర్‌లో చేరుకోగా ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల కన్నీరు తుడవడానికి తీసుకొచ్చిన చట్టమే భూ భారతి అని, ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఒక చట్టం రూపొందిస్తే అది పేదవాడికి చుట్టంలాగా ఉండాలని.. భూ భారతి చట్టం వందేళ్లకు సరిపడే విధంగా ఉందని తెలిపారు. ఆధార్ తరహాలో భూధార్ నంబర్ త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారని.. ఇప్పుడింకా ఆ అవసరం లేదని, అధికారులే రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు.
● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఏడాది పాటు ఇతర రాష్ట్రాల్లోని చట్టాల్ని అధ్యయనం చేసి భూ భారతి రూపకల్పన చేసిన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రతిపక్షాలు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని.. ప్రజలు గుర్తించి పేదల అభ్యున్నతికి పాటుపడే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.
● ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో రూపొందించిన భూ భారతి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని తెలిపారు. రైతు బిడ్డకు మాత్రమే అన్నదాతల కష్టాలు, భూమితో రైతుకు ఉన్న అనుబంధం తెలుస్తుందని.. భూ భారతి అమలుతో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి ఎవరి దగ్గరకు పైరవీలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. పోర్టల్‌లో అన్ని ఆప్షన్లు ఉన్నాయన్నారు.
● ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రైతులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. రైతులు మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు.. తహసీల్దార్ కార్యాలయంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
● కలెక్టర్ బదావత్ సంతోష్ భూ భారతి చట్టం గురించి వివరిస్తూ కొత్త ఆర్వోఆర్ చట్టం విధి విధానాలను రైతులకు తెలియజేశారు.
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..
భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని.. రైతులు సమగ్ర వివరాలు తెలుసుకోవాలని సూచించారు. రైతుల భూ సమస్యలను గ్రామంలోనే రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారని తెలియజేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, భూ సమస్యలు లేని రాష్ట్రాన్ని చూడబోతున్నామని వివరించారు. సదస్సుకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమణారావు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆధార్‌లాగే త్వరలోనే భూధార్ నంబర్
రెవెన్యూశాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి