
సిర్సనగండ్ల ఆదాయం రూ.12.67 లక్షలు
చారకొండ: అపర భద్రాదిగా పేరుగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 5 నుంచి 11 వరకు వైభవంగా కొనసాగాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను బుధవారం ఆలయ చైర్మన్ రామశర్మ, ఎండోమెంట్ అధికారి వీణాధరి, తహసీల్దార్ సునీత, ఎస్‌ఐ శంషోద్దీన్, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, యూనియన్ బ్యాంకు మేనేజర్ నర్సింహ, అధికారుల సమక్షంలో లెక్కించారు. మొత్తం రూ.12,67,915 నగదు, వెండి 400 గ్రాములు సమకూరినట్లు ఆలయ చైర్మన్, ఈఓ ప్రకటించారు. అదేవిధంగా ఇండోనేషియాకు చెందిన 2 వేల కరెన్సీని భక్తులు హుండీలో వేసినట్లు గుర్తించారు. గతేడాది కంటే రూ.4,40,937 ఎక్కువగా వచ్చిందని వివరించారు. కార్యక్రమంలో అధికారులు, ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
తెలకపల్లి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గౌతంపల్లిలో సీసీ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 10 లక్షలతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, నాగరాజు, నారాయణగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలుసద్వినియోగం చేసుకోవాలి
అచ్చంపేట రూరల్: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ మాధవి కోరారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సతీమణి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు డా. అనురాధతో కలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంలాంటివన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ హైదరాబాద్ నుంచి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
‘గాలికుంటు’ నివారణ టీకాలు వేయించాలి
బల్మూర్: సీజనల్ వ్యాధులు సోకకుండా రైతులు తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. జ్ఞానశేఖర్ సూచించారు. బుధవారం మండలంలోని జిన్‌కుంటలో నిర్వహించిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరంలో ఆయన పాల్గొన్నారు. పశుసంపద పెంపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం పశు పోషణకు అందిస్తున్న పథకాల గురించి రైతులకు వివరించారు. శిబిరంలో మొత్తం 310 పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారులు డా. అనిల్, డా. మహేశ్వరి, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

సిర్సనగండ్ల ఆదాయం రూ.12.67 లక్షలు

సిర్సనగండ్ల ఆదాయం రూ.12.67 లక్షలు