
రాజ్యాధికారం కోసం ఉద్యమిద్దాం
బిజినేపల్లి: అగ్రకుల నాయకుల సహకారంపై ఆధారపడకుండా బీసీలు స్వయంగా ఉద్యమించి రాజ్యాధికారం సాధించుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం బిజినేపల్లిలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జాజులతో పాటు ప్రొ.కాశీం, బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత బైకాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దీలీపాచారి హాజరయ్యారు. ఫూలే విగ్రహావిష్కరణ అనంతరం జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. జనాభాలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు 10 శాతం జనాభా ఉన్న వారికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అగ్రకులాల వారే బలహీన కులాల వారని.. బీసీలు బలమైన కులస్తులని అన్నారు. పోలవరంలో మునిగిపోయిన పడవను నలుగురు గంగపుత్రులు పట్టుకొచ్చారని గుర్తుచేశారు. కులవృత్తుల వారు లేకుంటే ఇతర వర్గాలకు బతుకు లేదని.. బీసీల చేతిలో గుత్ప ఉంటేనే రాజ్యాధికారం వస్తుందన్నారు. ప్రొ.కాశీం మాట్లాడుతూ.. జ్యోతిరావు ఫూలే ముదిరాజ్ కులస్తుడని, ఆయనను చదువుకు దూరం చేయాలని కొందరు యత్నిస్తే.. క్రైస్తవ పాస్టర్ వద్దకు రాత్రి బడికి వెళ్లి చదువుకున్నారని గుర్తుచేశారు. బీసీలు కులవృత్తుల వల్ల చదువుకు దూరమయ్యారన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలు ఎందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేకపోతున్నారని.. అతి తక్కువ జనాభా ఉన్న అగ్రకులాలు ఎందుకు రాజ్యమేలుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. బీసీలు ఏకమై ఉద్యమిస్తేనే భవిష్యత్‌లో రాజ్యాధికారం సాధిస్తామన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొ.పెబ్బేటి మల్లికార్జున్, స్థానిక నాయకులు బాలరాజ్‌గౌడ్, మంగి విజయ్, కుర్మయ్య, మిద్దె రాములు, రాజేందర్‌గౌడు, రామన్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.