బిజినేపల్లి: ప్రకృతి రమణీయమైన కోవెలగా పేరొందిన వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి సోమవారం వరకు ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే శనివారం ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరగనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 6 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో స్వామి వారం అలంకారం, రాజభోగ నివేదన, తిరుచ్చిసేవ, సంతానార్థులకు గరుడ ప్రసాద పంపిణీ, స్వామివారి ఉత్సవమూర్తులకు నవకలశ స్నపన తిరుమంజనం, ఎదుర్కోళ్లు, గరుడ వాహన సేవ, కల్పవృక్ష వాహన సేవ, నవకలశ స్నపనం, అశ్వవాహన సేవ, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, తీర్థ ప్రసాద వితరణ పల్లకీసేవ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆలయ 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు
452 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 7,528 మంది విద్యార్థులకు గాను 7,076 మంది హాజరవగా.. 452 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,830 మందికి గాను 5,499 మంది, ఒకేషనల్ విభాగంలో 1,698 మందికి గాను 1,577 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్ విభాగంలో 331 మంది, ఒకేషనల్ విభాగంలో 121 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగరకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం
అచ్చంపేట రూరల్: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూసారాన్ని పెంచుదామని జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మండలంలోని సింగారం శివారులో కృష్ణయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో గో ఆధారిత వ్యవసాయంపై గో సేవా విభాగం, గ్రామ భారతి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు అధిక మోతాదులో వాడటం వల్ల భూమిలో సారం నశించిపోతుందన్నారు. నీటి యాజమాన్య పద్ధతులు అవలంభించడం వల్ల పంటల అధిక దిగుబడిని సాధించవచ్చన్నారు. నీటి వినియోగం ఎక్కువ, తక్కువ అయినా కూడా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ లెక్కల ప్రకారం పంటకు నీరు ఎక్కువ కావడం వల్ల దిగుబడి తగ్గినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారన్నారు. జిల్లాలో 50 వేల ఎకరాల మొక్కజొన్న విస్తీర్ణం పెరిగిందని, ఒక పంటకు దాదాపు 9 సంచుల యూరియా వాడినట్లు వెళ్లడైందన్నారు. ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పిస్తుందని, భవిష్యత్‌లో జిల్లాలో 15 క్లస్టర్లలో 500 ఎకరాలలో ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రాలను పెంపొందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత లోకసాని పద్మారెడ్డి, జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు వాసు, మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య, 12 క్లస్టర్ల ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
పీయూలో వర్క్‌షాప్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కన్వీనర్ అర్జున్‌కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్‌ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి వట్టెం వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు