ఇంటి నుంచే.. యూరియా బుకింగ్
నేటి నుంచి అందుబాటులోకి మొబైల్ యాప్
ములుగు: రైతులు ఇక యూరియా కోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పని లేదు. రైతు ఇంటి నుంచే మొబైల్‌లో యూరియా బుక్ చేసుకునేలా వ్యవసాయశాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. నేటి నుంచి యాప్ అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 1,02,250 ఎకరాల్లో పంటలు సాగు కానుండగా 25,600 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఈ మేరకు 80 వేల ఎకరాల్లో వరిపంట, 9,300 ఎకరాల్లో మొక్కజొన్న, 12,500 ఎకరాల్లో మిర్చి, 450 ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. ఈ పంటలకు వినియోగించేందుకు గాను 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 6,500 మెట్రిక్ టన్నుల డీఏపీ, 2,100 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
మొబైల్‌లో ఎరువుల యాప్ ఓపెన్ చేయగానే రైతులు, వ్యవసాయశాఖ, డీలర్ల కోసం లాగిన్లు కనిపిస్తాయి. లాగిన్‌లో మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే డీలర్లు, యూరియా స్టాక్ వివరాలు కనిపిస్తాయి. పాస్‌బుక్ నంబర్, పంట విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. సాగు చేసే పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మోతాదులో యూరియా బ్యాగుల సంఖ్య కనిపిస్తుంది. యూరియా బుక్ చేసిన తర్వాత 15 రోజుల్లో 4 దశల్లో యూరియా అందుతుంది. పాస్‌బుక్ లేని రైతులు పట్టాపాస్ బుక్ ఆఫ్షన్‌లో ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి, ఓటీపీ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు నమోదు చేయాలి. కౌలు రైతులు సైతం యూరియా తీసుకోవచ్చు.
వ్యయసాయ శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా రైతు నేరుగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు. ఏయే డీలర్ల వద్ద ఎంత స్టాక్ ఉందో తెలుస్తుంది. ఇందుకనుగుణంగా యూరియాను బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా తీసుకునే అవకాశం ఉంటుంది. పరిమితికి మించి యూరియా తీసుకునే అవకాశం లేదు. కృత్రిమ కొరతకు ఆస్కారం ఉండదు.
– సురేశ్‌కుమార్, డీఏఓ
వ్యవసాయశాఖ తయారు చేసిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులు డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చు. తనకు ఇష్టమైన డీలర్ నుంచి బుక్ చేసుకోవచ్చు. వెంటనే ఐడీ వస్తుంది. అందుకనుగుణంగా డీలర్ వద్ద నుంచి యూరియా కొనుగోలు చేయవచ్చు. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భూవిస్తీర్ణం, వేసిన పంటకనుగుణంగా యూరియా తీసుకునే అవకాశం ఉంది. తద్వారా పరిమితికి మించి యూరియా వాడకుండా, పక్కదారి పట్టకుండా చూడొచ్చు.
యాసంగిలో 1,02,250
ఎకరాల్లో పంటల సాగు
25,600 మెట్రిక్ టన్నుల
ఎరువు అవసరం
ఇంటి నుంచే.. యూరియా బుకింగ్
ఇంటి నుంచే.. యూరియా బుకింగ్


