‘మేడారం జాతరకు నిధులు కేటాయించాలి’
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని నాయకులు కోరారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఆధ్వర్యంలో మంత్రిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జాతరకు నిధుల కేటాయింపునకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ మ్యూజియం అభివృద్ధికి, ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. భద్రాచలం నుంచి మేడారం మీదుగా కాళేశ్వరం వరకు రోడ్డు అభివృద్ధి చేయాలని విన్నవించినట్లు తెలిపారు. సమ్మక్క–సారలమ్మ యూనివర్సిటీకి నిధులు మంజూరు చేయడంతో పాటు మేడారంలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం, ఐటీడీఏకు నిధుల మంజూరుతో పాటు మేడారం జాతర అభివృద్ధికి టూరిజం హెరిటేజ్ అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారని బలరాం వివరించారు. మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన వారిలో పార్టీ జిల్లా ఉపాధ్యకుడు భరతపురం నరేశ్ మందాల లవన్ కుమార్, ఆదివాసీ రాష్ట్ర నాయకుడు పోదెం రవీందర్, మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్, వనవాసీ కల్యాణ్ పరిషత్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ ఉన్నారు.


