ప్రతీ రూపాయి లెక్క చెప్పాల్సిందే
నామినేషన్ నుంచి
ఎన్నికలు ముగిసే వరకు
భూపాలపల్లి అర్బన్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓడినా, గెలిచినా ప్రచారం కోసం పెట్టిన ప్రతీ రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్‌కు చెప్పాలి. ఏ విడత జరిగే ఎన్నిక అయినా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ ముగిసే రోజు వరకు (15 రోజులు) సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే. అందుకు ప్రతీ అభ్యర్థి బ్యాంకులో కొత్తగా ఖాతా తెరిచి, ఆ ఖాతా ద్వారానే ఎన్నికలకు ఖర్చు చేయాలి. పాత ఖాతాను వినియోగించినట్టయితే అందులో నిర్వహించే ఇతర లావాదేవీలకు సైతం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులకు తల నొప్పిగా మారుతోంది. అందుకే కొత్త ఖాతాలు తెరవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. నామినేషన్ పత్రంతో పాటు బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతిని కూడా జతపరచడం తప్పనిసరి.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5వేల జనాభాకు మించిన గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షలు, వార్డు సభ్యుడు రూ.50వేలు మాత్రమే ఎన్నికల వ్యయం చేయాలి. 5 వేల జనాభాలోపు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు సభ్యుడు రూ.30వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఖర్చు పరిమితి మించితే వేటు పడుతుంది.
వ్యయ పరిశీలకుల నియామకం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు చేసే ఖర్చులను పరిశీలించడానికి జిల్లాలోని మండలానికి ఒక వ్యయ పరిశీలకుడిని అధికారులు నియమించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వినియోగించే పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రింట్, డిజిటల్ మీడియా ప్రకటనలు, వాహనం అద్దె, డ్రైవర్ వేతనం, ఇంధనం, మైకులు, సౌండ్ సిస్టమ్, టెంట్లు, కుర్చీలు, భోజనం, లాడ్జింగ్, బోర్డింగ్, కార్యకర్తలకు ఇచ్చే ఖర్చులు, జెండాలు, టీ, టిఫిన్, కాఫీలు, క్యాప్లు, టీ–షర్టులు, బ్యాడ్జీలు, ప్రచార వాహనాల అలంకరణ ఖర్చుల లెక్కలు చూపాలి. వాటి ధరలు ఎన్నికల అధికారులు నిర్ణయించిన మేరకే ఉండాలి.
45రోజుల్లో లెక్కలు ఇవ్వాలి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు మూడు విడతలుగా ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించాలి. ప్రచార ప్రారంభంలో మొదటిసారి, ప్రచారం మధ్య దశలో రెండోసారి, పో లింగ్‌కు ముందు రోజు మూడోసారి లెక్కలు ఇవ్వాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో అభ్యర్థులు వారి ఖర్చు లెక్కలు ఎన్నికల అధికారులకు తగిన బిల్లులతో సమర్పించాలి. ఎన్నికల ఖర్చులు నామి నేషన్ పత్రంలో సూచించిన బ్యాంకు ఖాతా ద్వా రానే నిర్వహించాలి. ఓడినా, గెలిచినా ఖర్చు లెక్కలు ఇవ్వాల్సిందే. గెలిచిన అభ్యర్థులు ఖర్చు లెక్కలు ఇవ్వకుంటే పదవి పోతుంది. ఓడిన అభ్యర్థులు ఇవ్వకుంటే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది.
నూతన బ్యాంకు ఖాతా ద్వారానే
చెల్లింపులు
45 రోజుల్లో లెక్క చూపకుంటే
పదవి గోవిందా
మూడేళ్లు అనర్హత వేటు


