నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
గోవిందరావుపేట: ల్యాబ్‌లు, క్లినిక్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సోమవారం పస్రాలోని కేర్, వినాయక డయాగ్నోస్టిక్ సెంటర్లు, సిరి క్లినిక్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్ పత్రాలు రికార్డులు, రిపోర్టులను పరిశీలించి, రోగులకు అవసరం లేని పరీక్షలు చేసి భయపెట్టవద్దన్నారు. పరీక్షల ధరల పట్టికను ల్యాబ్ ముందు ప్రదర్శించాలన్నారు. పస్రాలో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులతో మాట్లాడుతూ అర్హతకు మించి చికిత్సలు చేయరాదని, యాంటీ బయోటిక్స్, సైలెన్‌లు ఇవ్వడం నిషేధమన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.


