ములుగు రూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ టీఎస్ దివాకర సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలని, పరిష్కారంకాని దరఖాస్తులు తగిన కారణం చూపుతూ దరఖాస్తుదారుడికి తెలియ జేయాలన్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 61 దరఖాస్తులు రాగా భూ సమస్యలు 19, గృహనిర్మాణ శాఖ 10, పెన్షన్ 5, ఉపాధి కల్పన 4, ఇతర శాఖలకు సంబంధించినవి 23 దరఖాస్తులు వచ్చాయన్నారు. వినతులను ఆయాశాఖల అధికారులకు బదలాయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ సేవలను సీఎస్‌సీలకు కేటాయించాలి
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ఆన్‌లైన్ సేవలను కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ)లకు కేటాయించాలని సీఎస్‌సీవీఎల్ చాపర్తి రాజు, మిల్కురి యుగందర్, దొంగరి రాజేందర్, ప్రభాకర్, అజ్మీర వినోద తదితరులు కలెక్టర్ టీఎస్ దివాకరకు వినతిపత్రం అందించారు.
సమస్యల పరిష్కారానికి కృషి
ఏటూరునాగారం: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్భార్ నిర్వహించారు. గిరిజనుల నుంచి ఏపీఓ 13 వినతులు స్వీకరించారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన గిరిజనుడు కారుణ్య నియామకం ఇప్పించాలని కోరారు. భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ గ్రామానికి చెందిన గిరిజనుడు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో ఎస్టీ కమ్యూనిటీ హాల్ వద్ద బోర్‌వెల్ నిర్మించాలని కోరారు. మేడారం జాతరలో అభివృద్ధి పనులు, పెయింటింగ్ పనులు తుడుందెబ్బకు ఇప్పించాలని గిరిజనులు కోరారు. వాజేడు మండలం పేరూరుకు చెందిన 21 మంది గిరిజనులు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో డీడీ జనార్ధన్, ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్‌బాబు, మేనేజర్ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, ఆర్‌ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ దివాకర
ప్రజావాణిలో 61,
ఐటీడీఏలో 13 దరఖాస్తులు
సత్వర పరిష్కారం చూపాలి


