
ఇసుక అక్రమ రవాణాకు తావివ్వొద్దు
భూపాలపల్లి: ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై రెవెన్యూ, పోలీస్, అటవీ, మైనింగ్, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్లు లేకుండా ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లను వెంటనే సీజ్ చేయాలన్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక రవాణా చేయాలన్నారు. ఇతర జిల్లాలు, ప్రాంతాలకు ఇసుక రవాణా నిషేధమని స్పష్టం చేశారు. జిల్లా సరిహద్దుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా పటిష్ట పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తామన్నారు.
భక్తులకు ఇబ్బంది రానివ్వొద్దు
బుగులోని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ బుగులోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం జాతర, బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే హాజరయ్యారు. సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో నవంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే బుగులోని వేంకటేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్లుకు అంతరాయం లేకుండా తాత్కాలిక మరమ్మతులు, రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. భక్తులు గుట్టపైకి చేరడానికి అనువుగా ఎలాంటి ప్రమాదం వాటిల్ల కుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బుగులోని జాతర భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు