
సమర్థులకే డీసీసీ అధ్యక్ష పదవి
గోవిందరావుపేట: కాంగ్రెస్ పార్టీకి పారదర్శకత, నిబద్ధత, సమర్థత కలిగిన నాయకులకే డీసీసీ అధ్యక్ష పదవి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం అన్నారు. మండల పరిధిలోని చల్వాయిలో గల పీఎస్‌ఆర్ గార్డెన్‌లో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ అధ్యక్షతన మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, నూతన డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్రహం హాజరై మాట్లాడారు. పార్టీ పునర్నిర్మాణం, నాయకత్వ బలోపేతం లక్ష్యంగా సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని తెలిపారు. ఈ మేరకు పార్టీ అభ్యున్నతికి పాటుపడుతూ ప్రజలు, కార్యకర్తలతో అనుబంధం ఉన్నవారే పార్టీ భవిష్యత్ నేతలు అవుతారన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో పక్షపాతం ఉండదని తెలిపారు. పార్టీ నాయకులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, యువత అన్ని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ఈ అభియాన్ ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రతీ కార్యకర్త తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చని తెలిపారు. సమావేశం అనంతరం డీసీసీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు సాగరికరావు, నాగేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, ఎల్లారెడ్డి, సోమయ్య, వెంకన్న, క్రాంతి, గుండెబోయిన నాగలక్ష్మి, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ అబ్జర్వర్ అబ్రహం