
రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో రాణించాలి
● డీఈఓ సిద్ధార్థరెడ్డి
ములుగు రూరల్: ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడాపోటీల్లో రాణించి రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న 69వ ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడాపోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాలోని అండర్ –14 విభాగంలో కబడ్డీ క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. 200 మంది క్రీడాకారులు పాల్గొనగా బాలికల విభాగంలో 14 మంది, బాలుర విభాగంలో 14 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు వివరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ సెక్రటరీ సూర్య హాజరై క్రీడాపోటీలను చూశారు. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై న విద్యార్థులకు టీషర్ట్‌లు, షూ అందిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడా కార్యదర్శి బల్గూరి వేణు, వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుండబోయిన మల్లయ్య, క్రీడల ఆఫీసర్ ఆదినారాయణ, జగదీశ్, నాగేందర్, లవనిక, నరేష్, సరిత, పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.