
హేమాచలుడిని దర్శించుకున్న బీజేపీ నేత
మంగపేట: మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని బీజేపీ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన ప్రసాద్ తివారీ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి సారిగా ఆలయానికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యుల గోత్ర నామాలతో ఆలయ పూజారులు స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చన జరిపించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో దేశం సుభిక్షంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలని, బీహార్, జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు.
సబ్‌స్టేషన్‌కు 33 కేవీ లైన్ ప్రారంభం
ములుగు రూరల్: మల్లంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌కు 33 కేవీ నూతన లైన్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ సీఈ ఆపరేషన్ రాజు చౌహన్ ప్రారంభించారు. ఈ మేరకు శనివారం విద్యుత్ సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యుత్ లైన్‌తో రామచంద్రాపూర్, కొడిశలకుంట గ్రామాల వినియోగదారుల లోఓల్టేజ్ సమస్యలు తీరుతాయని తెలిపారు. 33 కేవీ లైన్ పునరుద్ధరణ చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, ములుగు ఎస్‌ఈ మల్చూర్‌నాయక్, డీఈ నాగేశ్వర్‌రావు, ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రవి, సిబ్బంది పాల్గొన్నారు.
కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలకు శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి కాలసర్ప, శని పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది.
ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ
భూపాలపల్లి అర్బన్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ, దిశ ములుగు ఆధ్వర్యంలో శనివారం భూపాలపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పీహెచ్‌సీ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ ఉమాదేవి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, ఆస్పత్రి ఆర్‌ఎంఓలు డాక్టర్ దివ్య, డాక్టర్ రాజేష్, దిశ క్లస్టర్ మేనేజర్ జ్యోతి, మారి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సదానందం హాజరై వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. 2030 సంవత్సరం నాటికి హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రించడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది, మారి సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్ పరిశీలన
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సోలార్ జీఎం సీతారామ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరలో ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మరో 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు స్థలం, పరికరాలు, ప్రాజెక్ట్‌కు కావాల్సిన సలహాలు, సూచనలు అధికారులకు వివరించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎర్రన్న, మారుతి, అప్పారావు, గోపినాథ్, రాహుల్ పాల్గొన్నారు.