
‘కార్యకర్తలు దేశానికి సేవ చేయాలి’
ఏటూరునాగారం: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు దేశానికి సేవ చేయాలని మూడు రాష్ట్రాల గోరక్ష ప్రముఖ్ ఆకుతోట రామారావు తెలిపారు. మండల కేంద్రంలో వై జంక్షన్ నుంచి రామాలయం వరకు ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీ(రూట్‌మార్చ్) పథ సంచాలన కార్యక్రమాన్ని ఆది వారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ దసరా ఉత్సవాల నుంచి మళ్లీ వచ్చే దసరా ఉత్సవాలకు శతాబ్ధి ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 ఏళ్లు అయిందని తెలిపారు. అందుకోసం ప్రతీ గడపకు ఆర్‌ఎస్‌ఎస్ నిబంధనలను తీసుకెళ్లాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దేశశ రక్షణ, భారతమాత కోసం పనిచేయాలన్నారు. నీతి, నిజాయతీగా ఉంటూ సనాతన ధర్మాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, సమ్మయ్య, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
13న జిల్లా స్థాయి
సైన్స్ డ్రామా ఫెస్టివల్
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్‌లో ఈనెల 13న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు డీఎస్‌ఓ అప్పని జయదేవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు శ్రీమానవ జాతి ప్రయోజనం కోసం శాస్త్ర సాంకేతికతశ్రీ అనే ఆంశంపై ఫెస్టివల్ నిర్వహంచనున్నట్లు వెల్లడించారు. ఇందులో విజ్ఞాన శాస్త్రంలో మహిళలు, స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, అందరికీ పరిశుభ్రత, హరిత సాంకేతికతలు అనే ఉప అంశాలు ఉంటాయని వివరించారు. ప్రజెంటేషన్ ఆఫ్ ది డ్రామాకు 50 మార్కులు, సైంటిఫిక్ కంటెంట్ ఆఫ్ ది డ్రామాకు 30 మార్కులు, ఎఫెక్ట్ వెన్సెస్ ఆఫ్ ది డ్రామాకు 20 మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి డ్రామా ప్రోగ్రాం 30 నిమిషాలకు మించరాదని తెలిపారు. ప్రతీ టీంలో డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్‌తో పాటు 10 మందికి మించి ఎక్కువగా ఉండరాదని వెల్లడించారు. జిల్లా స్థాయి డ్రామా ఫెస్టివల్‌లో పాల్గోనే విద్యార్థులు ఈ నెల 11వ తేదీలోపు జిల్లా సైన్స్ అధికారి దగ్గర వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
గిరిజన దర్బార్ రద్దు
ఏటూరునాగారం: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఐటీడీఏలో ప్రతీ సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్‌ను రద్దు చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన దర్బార్‌ను ఎన్నికల కోడ్ ముగిసే వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. గిరిజనులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
శాంతి స్తూపానికి
ఎరుపు రంగు
ములుగు రూరల్: ములుగు జిల్లాకేంద్రంలో శాంతి స్తూపానికి గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపు రంగు వేశారు. 2004లో సీపీఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో మావోయిస్టుల అమరవీరుల స్తూపం నిర్మించి ఎరుపు రంగు వేయడంతో పాటు సుత్తె కొడవలి గుర్తును ఏర్పాటు చేశారు. కొంతకాలం తర్వాత ఆ స్తూపానికి తెలుపు రంగు వేసి శాంతి స్తూపంగా పేరును మార్చారు. అప్పటి నుంచి తెలుపు రంగులో దర్శనమిచ్చిన స్తూపం సగం వరకు ఎరుపు రంగుతో ఆదివారం దర్శమిచ్చింది. జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపానికి ఎరుపు రంగు ఎవరు వేశారనే దానిపై చర్చ సాగుతోంది.
కారు బోల్తా
చిట్యాల: భూపాలపల్లి నుంచి మొగుళ్లపల్లి వెళ్తుండగా అదుపుతప్పి కారు బోల్లా పడిన ఘటన మండలకేంద్రంలోని క్రోసూరుపల్లి గ్రామశివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ కురిమిళ్ల మహేష్ పని నిమిత్తం భూపాలపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. క్రోసూరుపల్లి గ్రామశివారులో గల ప్రధాన రోడ్డు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు.

‘కార్యకర్తలు దేశానికి సేవ చేయాలి’