
కోటిన్నర ప్రాపర్టీ పట్టు!
కాళేశ్వరం: ఐదు వేల ఒక రూపాయితో కూపన్ కొనుగోలు చేసి.. లక్కీడ్రాలో మొదటి బహుమతి వరిస్తే కోటిన్నర ప్రాపర్టీ సొంతం చేసుకొనే అదృష్టం లభిస్తుందని వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు వైరల్ అవుతున్నాయి. మొన్నీమధ్య యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద 66 గజాల ప్లాటుకు రూ.500 కూపన్ పెట్టి విక్రయాలు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారింది. అది మరువక ముందే మళ్లీ కాళేశ్వరంలో అలాంటి ప్రాపర్టీ విక్రయ సేల్‌కు భవన యజమాని కొత్తగా ఆలోచన చేశాడు. కాళేశ్వరంలోని ఎస్‌ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌ను యజమాని శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల విక్రయానికి పెట్టాడు. కానీ సరైన ధర, కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లక్కీడ్రాను ఏర్పాటు చేసి అందరూ కూపన్‌లు కొనేలా ప్లాన్ చేస్తున్నాడు. రూ.5,001తో లక్కీ డ్రా కూపన్ తీసుకొని కోటిన్నర విలువగల ప్రాపర్టీని పట్టు అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు. మొత్తం లక్కీ డ్రా కూపన్లు 2,500 వరకు విక్రయించడానికి సిద్ధమయ్యాడు. మొదటి బహుమతి కోటిన్నర ప్రాపర్టీ, రెండవ బహుమతి రెండు తులాల బంగారం, మూడో బహుమతి కిలో వెండి అందజేస్తామని కూపన్‌లలో పేర్కొంటున్నాడు. ఈ లక్కీ డ్రా జనవరి 14న డ్రా తీయనున్నారు. దీంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూ పన్లు తీసుకోవడానికి ఆరా తీస్తున్నారు. ఇతర ప్రాంతాల వారు కూడా విషయం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాతో పాటు మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై పోలీసులు, నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
కూపన్ కొనుగోలుకు
ఉవ్విళ్లూరుతున్న జనం
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వైనం
జిల్లా పోలీసులు, నిఘావర్గాల ఆరా!