
ఇంటర్ లింకింగ్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి
ములుగు: ఇంటర్ లింకింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ (ఆపరేషన్–2) సీఈ రాజు చౌహాన్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కంపెనీ డైరెక్టర్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎంఆర్‌టీ కన్‌స్ట్రక్షన్, డీపీవీ వింగ్స్, అకౌంట్స్ ఆఫీసర్స్ హాజరు కాగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించాలన్నారు. అనంతరం తాడ్వాయి మండలంలో 33 కేవీ కవర్డ్ కండక్టర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్‌ఈ ఆపరేషన్ మల్చూరు నాయక్, డీఈలు పులుసం నాగేశ్వర్‌రావు, పాపిరెడ్డి, వెంకటేశం, ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
సోలార్ విలేజ్ పథకంపై అవగాహన
ఏటూరునాగారం/మంగపేట: మోడల్ సోలార్ విలేజ్ స్కీంపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని టీజీఆర్‌ఈడీ జిల్లా మేనేజర్ రాజేందర్ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో అవగాహన సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలు ఎక్కువగా అవుతున్నాయని, అందుకుగాను సోలార్‌ను ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్‌ను ఆదా చేయాలన్నారు. సౌరశక్తి ప్లాంట్‌లను విరివిరిగా ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఫీల్డ్ ఆఫీసర్ నవీన్‌కుమార్‌యాదవ్‌లు, ఏఈ అశోక్, లైన్‌ఇన్‌స్పెక్టర్, లైన్‌మెన్లు పాల్గొన్నారు.
ఒకేషనల్ కోర్సులో
ఇంటర్న్‌షిప్
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి మోడల్‌స్కూల్‌లో విద్యార్థులు సాధారణ విద్యతో పాటు ఒకేషనల్ కోర్సుల్లో 9వ నుంచి 12వ తరగతి వరకు హెల్త్‌కేర్, బ్యూటీ, వెల్నెస్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న క్రమంలో దసరా సెలవుల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు నిర్వహించారు. చల్వాయి మోడల్ స్కూల్ బ్యూటీ అండ్ వెల్నెస్ ట్రేడ్ విద్యార్థులు ములుగులోని రమ బ్యూటీ పార్లర్‌లో ప్రాక్టికల్ శిక్షణ పొందుతూ, వృత్తి పరమైన నైపుణ్యాలను సాధించారు. ఈ సందర్భంగా చల్వాయి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గండు కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు దసరా సెలవులను సద్వినియోగం చేసుకొని వృత్తి విద్యా నైపుణ్యాలను నేర్చుకోవడం సంతోషకరమన్నారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా విద్యార్థులు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌కేర్ ట్రేడ్ ట్రైనర్ పావని, బ్యూటీ అండ్ వెల్నెస్ ట్రైనర్ టీ.సౌజన్య, విద్యార్థినులు పాల్గొన్నారు.
నేడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఏటూరునాగారం ఐటీఐ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను మంత్రి సీతక్క చేతుల మీదుగా నేడు (శనివారం) ప్రారంభించనున్నారు. మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ బలరాం హాజరుకానున్నారు. ఇందుకోసం ఐటీఐ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.