
పరిషత్‌కు ముందడుగు !
ములుగు: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రాదేశిక ఎన్నికలకు ముందడుగు పడింది. మండల పరిషత్ సభ్యులు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ సభ్యుల (జెడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్‌ల రూపకల్పనపై జెడ్పీ సీఈఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.సంపత్‌రావు శనివారం డ్రాఫ్ట్(ముసాయిదా)ను విడుదల చేశారు. రేపటి(సోమవారం) లోపు అభ్యంతరాలు స్వీకరించి, 9న పరిష్కరించి, 10న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితా యథావిధిగా ఉండనుండగా, పోలింగ్ స్టేషన్ల మార్పుతో పాటు ఎంపీటీసీ పరిధిలో వచ్చే గ్రామాల వివరాలను తుది జాబితాలో అధికారులు ప్రకటించనున్నారు.
83 ఎంపీటీసీ స్థానాలు..
473 పోలింగ్ స్టేషన్లు
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 10 జెడ్పీటీసీ స్థానాలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 2,29,159 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు. 8న వివిధ రాజకీయ పార్టీల నేతలతో మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 9వ తేదీన స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి 10న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.
రిజర్వేషన్లపై
ఉత్కంఠ..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుండగా, రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉంది. దీంతో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పాత రిజర్వేషన్‌లను కొనసాగిస్తారా.. కొత్తగా రిజర్వేషన్‌లను ప్రకటిస్తారా అనేది స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉండడంతో సెప్టెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణ పూర్తవుతుందా అనేది సందేహాంగానే మారింది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం మరింత సమయం కావాలని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.
రిజర్వేషన్లపై ఆదేశాలు లేవు..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో 10 జెడ్పీటీసీ స్థానాలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 473 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి 10వ తేదీన తుది జాబితా ప్రకటిస్తాం.
– సంపత్‌రావు,
అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై డ్రాఫ్ట్ విడుదల
8 వరకు అభ్యంతరాల స్వీకరణ
10న ఓటర్ల తుది జాబితా విడుదల
జిల్లాలో 83 ఎంపీటీసీలు, 10 జెడ్పీటీసీలు