
హేమాచలుడిని దర్శించుకున్న పీఓ
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన పీఓకు ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేష్, పూజారులు స్వాగతం పలికారు. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్న పీఓ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించి శేష వస్త్రాలను అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు
ములుగు రూరల్: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో 2026–27 విద్యా సంవత్సరంలో చేరేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణిమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకోదలచిన విద్యార్థులు వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినవారై ఉండాలని వెల్లడించారు. దరఖాస్తుల గడువు సెప్టెంబర్ –23 వరకు ఉందని ఎంపిక పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఉంటుందని వివరించారు. 9వ తరగతి దరఖాస్తులు చేసుకునే వారు 2025–26 విద్యాసంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఉండాలని 1 మే 2011 నుంచి 31 జూలై 2013 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. 11వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే వారు 2025–26లో 10వ తరగతి చదువుతూ 1 జూన్ 2009 నుంచి 31 జూలై 2011 మధ్యలో జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఎన్‌వీఎస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
‘విల్ట్’ సోకకుండా సేంద్రియ ఎరువు
వాజేడు: మిర్చి తోటకు విల్ట్ వైరస్ రాకుండా ఉండటం కోసం ముందస్తు నివారణలో భాగంగా ఓ రైతు ప్రత్యేకంగా సేంద్రియ ఎరువును తయారు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన ఇర్ప రామ్ముర్తి శనివారం ఎరువు వివరాలను వెల్లడించారు. ట్రైకో డర్మ్, సూడో మోనాస్ మందులను పశువుల ఎరువులో కలిపి మురగపెట్టాలని తెలిపారు. ఆ మందు ఎరువులో పూర్తిగా కలిసిన తర్వాత మిర్చి తోటను పాతే చేనులో చల్లి కలియ దున్నాలని వివరించారు. గతంలో ఈ పద్ధతి పాటించడం వల్ల విల్ట్ వైరస్ రాలేదని వెల్లడించారు.
మొక్కేతలు ప్రారంభం
వాజేడు: గోదావరి వరద కొంతమేర తగ్గడంతో కొందరు రైతులు మిర్చి మొక్కేతలను శనివారం ప్రారభించారు. మిర్చి నార్లు నాటడం ఇప్పటికే ఆలస్యం కావడంతో గోదావరి వరద తమ చేల వరకు రాదని భావించిన రైతులు మొక్కేతలను వేస్తున్నారు. మండల పరిధిలోని వాజేడు, గుమ్మడి దొడ్డి, జగన్నాథపురం గ్రామాల్లో ఈ మొక్కేతలు ప్రారంభం అయ్యాయి.
రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్‌గా ఉందని జర్మనీకి చెందిన జీస్టాస్ నిమాన్ కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన శనివారం సందర్శించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.

హేమాచలుడిని దర్శించుకున్న పీఓ

హేమాచలుడిని దర్శించుకున్న పీఓ