
ఉప్పొంగిన వాగులు
జోరువానతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
ఏటూరునాగారం: జిల్లాలో రెండురోజులుగా జోరువాన కురుస్తోంది. ఈ మేరకు బుధవారం వెంకటాపురం(కె) మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా వెంకటాపురం(ఎం) మండలంలో నమోదు అయ్యింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఏజెన్సీలోని జంపన్నవాగు ఉప్పొంగి మేడారం, కొండాయి, ఏటూరునాగారం ప్రాంతాల మీదుగా వరద ప్రవహించి గోదావరిలో కలుస్తోంది. కొండాయి వద్ద తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. మంగపేట–ఏటూరునాగారం మధ్యలోని జీడివాగు వద్ద భారీ వృక్షం కూలిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని తొలగించారు. గోదావరి వెంట ఉన్న కరకట్ట గేట్లను ఇరిగేషన్ సిబ్బంది ఎత్తి గ్రామంలోని వర్షపు నీటిని బయటకు పంపించారు.ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లా యంత్రాంగం అప్రమత్తం
జోరుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించడంతో కలెక్టర్ దివాకర యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాగులు ఉన్న ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే వెంటనే రవాణా నిలిపివేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని పహారా పెట్టాలని సూచనలు చేశారు. పోలీసులు సైతం టీంలుగా ఏర్పడి గోదావరి, వాగులు ఉన్న ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
పెరుగుతున్న గోదావరి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రామన్నగూడెంలోని పుష్కరఘాట్ వద్ద గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 10.23 మీటర్లకు నీటిమట్టం చేరుకొని ప్రవహిస్తోంది. జల వనరుల అధికారులు నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ నీటి కొలతల వివరాలను జిల్లా అధికారులకు చేరవేస్తూ అలర్ట్ చేస్తున్నారు. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా విపత్తు జరిగితే సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడానికి స్థానిక ఐటీడీఏ పరిధిలోని వైటీసీలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు.
తెగిన కొండాయి రోడ్డు.. రాకపోకలు బంద్
మండలంలోని కొండాయి–దొడ్ల మధ్యలో ఉన్న మట్టి రోడ్డు జంపన్నవాగు ఉధృతికి తెగిపోయింది. దీంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, ఐలాపురం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
నేలకూలిన భారీ వృక్షాలు
నీటమునిగిన పంట పొలాలు
జలగలంచ వాగును పరిశీలించిన
మంత్రి సీతక్క
పునరావాస కేంద్రాలకు ముంపు ప్రజలు
జలగలంచ వాగు పరిశీలన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: పస్రా– తాడ్వాయి మధ్యలోని జలగలంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం పరిశీలించారు. వాగుపై బ్రిడ్జి పైనుంచి వందలాది వాహనాల రాకపోకలు నడుస్తుండగా రాకపోకలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మండలాల వారీగా నమోదైన
వర్షపాతం వివరాలు(మిల్లీమీటర్లలో)
వెంకటాపురం(కె) 214.5
మంగపేట 119.5
ఏటూరునాగారం 105.3
వాజేడు 82.5
మల్లంపల్లి 51.8
ఎస్‌ఎస్ తాడ్వాయి 40.5
గోవిందరావుపేట 29.3
ములుగు 6.5
వెంకటాపురం(ఎం) 4.5

ఉప్పొంగిన వాగులు

ఉప్పొంగిన వాగులు

ఉప్పొంగిన వాగులు

ఉప్పొంగిన వాగులు