
మహిళల సంక్షేమానికి పెద్దపీట
ములుగు రూరల్: ప్రజా ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.200 కోట్ల ఉచిత ప్రయాణాలకు చేరుకున్న సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో చేపట్టిన సంబురాలకు మంత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి పాల్గొన్నారు. మహిళలకు సీట్లు పంపిణీ చేసి బహుమతులు అందజేసి సన్మానించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం, ఉచిత కరెంటు, రూ. 500 గ్యాస్, వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు. రూ.200 కోట్ల ఉచిత ప్రయాణాలతో మహిళలకు రూ. 6,700 కోట్లు ఆదా అయ్యాయన్నారు. ఉచిత ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అందిస్తుంటే కొంత మంది అవహేళన చేస్తున్నారన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలి పారు. జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, ఆర్‌ఎం విజయభాను పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క