
జనజీవనం అతలాకుతలం
మంగపేట: మండల పరిధిలోని భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. బాలన్నగూడెం, అబ్బాయిగూడెం తదితర ప్రాంతాల్లోని వివిధ చెరువులు మత్తడి పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటికి తిమ్మంపేట ఊర చెరువు మత్తడి పోస్తుండడంతో నీటి ఉధృతికి సుమారు 100కు పైగా ఎకరాల్లో నాటు వేసిన వరి పంట నీట మునిగింది. మల్లూరు అత్త చెరువు తూము లీకేజీతో లోతట్టు ప్రాంతంలోని బెస్తగుంపు జనావాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రవీందర్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరి అక్కడకు చేరుకుని జేసీబీతో నీటిని బయటకు పంపించారు. ఇరిగేషన్ అధికారులు చెరువుల తూము ముందు ఇసుక బస్తాలను అడ్డుగా వేసి లీకేజీ నీటిని బయటకు రాకుండా నియంత్రించారు. అదే విధంగా మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద, బోరునర్సాపురం సమీపంలోని ఉప్పలనర్సయ్య చెరువు వరదనీరు కట్టమైసమ్మ ఆలయం వద్ద ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై నుంచి పారింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, రైతు వేదిక అటవీశాఖ రేంజ్ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాలు మధ్యాహ్నం వరకు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్డు నుంచి గంపోనిగూడెం వరకు ఏటూరునాగారం– బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై నిర్మించిన కల్వర్టులను వరద నీరు ముంచేసింది. గంపోనిగూడెంను వరదనీరు చుట్టు ముట్టడంతో ఇళ్లలోకి మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

జనజీవనం అతలాకుతలం