
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వెంకటాపురం(కె): జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నష్టం వాటిళ్లకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం మండలంలోని ఎదిర పంచాయతీ పరిధిలోని యాకన్నగూడెం గ్రామ సమీపంలోని రాళ్లవాగును కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. వచ్చే మూడు రోజులు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాగులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వర్షాల కారణంగా శిథిల భవనాలు, పాత ఇళ్లలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. అవసరమైన చోట బోట్, రిస్క్‌టీమ్ ఏటూరునాగారంలో అందుబాటులో ఉందని తెలిపారు. గర్భిణులను స్థానిక ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర