
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ములుగు రూరల్: భారీ వర్షాల కారణంగా వరద ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో వరదల కారణంగా ప్రజలు ప్రాణ, ఆస్తినష్టం కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వరద ముప్పు ప్రాంతాల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయన్నారు. పర్యాటకులు జలపాతాల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అఽధికారులు 24గంటలు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 100 కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహక ప్రాంతం ఉందని తెలిపారు. గోదావరి నీరు గ్రామాల్లోకి రాకుండా ఏటూరునాగాం, మంగపేట ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణ పనులు సాగుతున్నాయని వివరించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాదులపై వైద్యాధికారులు అప్రమత్తం చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు అధికారులు సెలవులపై వెళ్లకూడదని తెలిపారు. జిల్లాను రెడ్‌జోన్‌గా వాతావరణశాఖ అధికారులు ప్రకటించారని అన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ వరద ముప్పును ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో నాలుగు బోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌టీఆర్‌ఎఫ్ బృందాలు సైతం సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఉన్నారని అన్నారు. జిల్లాలో 800 చెరువులు ఉన్నాయని ప్రస్తుతం నీటి సామర్థ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అనంతరం ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ వర్షాల కారణంగా 11 ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని ముందస్తుగా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వివిద శాఖ అధికారులు పాల్గొన్నారు.
పాఠశాల, వసతిగృహం
సందర్శన
వెంకటాపురం(కె): మండలంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పీఓ మండల పరిధిలోని ఆలుబాక ప్రభుత్వ పాఠశాలను, ఎస్టీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వసతిగృహం, పాఠశాలలోని కిచెన్‌షెడ్, కిటికీ మెస్, ఫెన్సింగ్ విరిగిపోవడంతో వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ప్రధాన రహదారి సీసీ అప్రోచ్ ఎస్టీ బాలుర వసతి గృహం, జీపీఎస్ పాఠశాల వరకు ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాలలో అదనపు గది, మరుగుదొడ్లను మంజూరు చేశారు.
స్వచ్ఛ సర్వేక్షణ్
సర్వే ప్రారంభం
ములుగు రూరల్: జిల్లాలోని 20 గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను కేంద్ర బృందం ప్రారంభించిందని అదనపు కలెక్టర్, డీఆర్‌డీఓ సంపత్‌రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏఎంఎస్ కేంద్ర బృందం సభ్యులు అదనపు కలెక్టర్‌కు నూల మొక్క అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రత్యేక యాప్ ద్వారా సర్వే నిర్వహించి ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేస్తారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో 171 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. ఎంపిక చేసిన 20 పంచాయతీల్లోని 16 ఇళ్లలో సర్వే నిర్వహించనున్నారని తెలిపారు. సర్వేలో ప్రత్యేకంగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, తడి, పొడి చెత్త నిర్వహణ, సానిటేషన్, పరిశుభ్రత తదితర అంశాలను సర్వే చేస్తారన్నారు. గ్రామ పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంఎస్ బృందం సభ్యులు మధు, రాకేష్, రాజు, వెంకటనారాయణ, ఎస్‌బిఎం కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి