
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలో రాష్ట్ర మంత్రి సీతక్క చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని జిల్లా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండల పరిధిలోని కాటాపూర్‌లో రూ. 30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ఎల్లమ్మ గుడి ప్రహరీ, పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు పార్టీ నాయకులతో కలిసి ఆమె సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణి మాట్లాడుతూ మంత్రి సీతక్క ఇప్పటికే మండలంలోని రూ.6 కోట్లకు పైగా నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలతో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఒక ఇళ్లు కూడా ఇవ్వకున్నా నియోజకవర్గానికి 6వేల ఇళ్లు మంజూరు చేసిన సీతక్క గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని సూచించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా కాటాపూర్ గ్రామానికి వెళ్లిన రేగ కల్యాణికి పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి మధు, మండల యూత్ అధ్యక్షులు కోడి సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగరం చిరంజీవి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముజఫర్, మాజీ సర్పంచులు శ్రీనివాస్, నరసింహస్వామి, నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముక్తి రామస్వామి, గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నరసయ్య, శ్రీధర్, గుండు సదయ్య, పులి రవి, రంగు రాజు, పద్మశాలి సంఘం నాయకులు సారయ్య, పల్నాటి సత్యం, కందకట్ల సాంబయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి
రూ. 30లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన