మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

Jul 18 2025 1:23 PM | Updated on Jul 18 2025 1:23 PM

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ములుగు రూరల్‌: రాష్ట్రంలోని మహిళలు వ్యాపార రంగాల్లో రాణించడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, సెర్ప్‌ అదనపు సీఈఓ కాత్యాయనితో కలిసి హాజరయ్యారు. తొలుత మహిళలు సీతక్కకు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వడ్డీలేని రుణాల చెక్కులు, లోన్‌ బీమా, ప్రమాద బీమా చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇందిరమ్మ కళలను నెరవేర్చేందుకు పలు పథకాలను అమలు చేస్తుందన్నారు. మహిళా సంఘాలకు రూ. 26 వేల కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలను పంపిణీ చేశామన్నారు. మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్లు కేటాయించడంతో పాటు వడ్డీ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని 9 మండల సమాఖ్యలు, 330 గ్రామ సమాఖ్యలు, 6,904 స్వయం సహాయక సంఘాలలో మొత్తంగా 69,736 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 618 స్వయం సహాయక సంఘాలకు రూ.54.79 కోట్ల రుణాలు అందించినట్లు వెల్లడించారు. 5,109 సహాయ సంఘాల సభ్యులకు రూ. 884.54 కోట్ల వడ్డీలేని రుణాలు అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంకట్రావ్‌ మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ అన్నారు. గత ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడంలో నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి తీసుకొచ్చిన పథకాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రామప్ప, ఐటీడీఏ, బొగత, కలెక్టర్‌ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా శక్తి క్యాంటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్‌లో లక్నవరం, బ్లాక్‌ బెర్రి పర్యాటక ప్రాంతాలలో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement