
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
ములుగు రూరల్: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితం గడపాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. ఈ సందర్భంగా సోమవారం ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ మాట్లాడారు. జిల్లా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి సంయుక్తంగా పోరుకన్న ఊరు మిన్న.. ఊరికి తిరిగి రండి అంటూ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఇదే క్రమంలో నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ హోదాలలో పని చేస్తున్న ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 73మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో డీవీసీఎంఎస్ 3, ఏసీఎంఎస్ 10, పీఎంఎస్ 22, మిలిషియా సభ్యులు 29మంది, ఆర్‌పీసీ సభ్యులు 1, డీఏకేఎంఎస్ 2, సీఎన్‌ఎంలు ఆరుగురు లొంగిపోయారని వివరించారు. లొంగిపోయినవారికి పునరావాస పథకానికి అనుగుణంగా సదుపాయాలు కల్పించామన్నారు. ఆదివాసీలు మావోయిస్టులకు సహకరించకపోవడంతో ఆరోగ్యం క్షిణించి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నడవలేని స్థితికి దిగజారిపోయారని వెల్లడించారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కర్రెగుట్టల అటవి ప్రాంతాల్లోని సంపదను స్వేచ్ఛగా అనుభవించేందుకు పోలీస్‌శాఖ, కేంద్ర బలగాలు క్యాంపులను ఏర్పాటు చేయనున్నాయన్నారు. అనంతరం లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులకు తక్షణ సాయం కింది ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున అందించారు. మిగిలిన మొత్తం బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో సుక్మా జిల్లాకు చెందిన శ్యామల రాజేష్, కడతిల్ దుమ, బీజాపూర్ జిల్లాకు చెందిన ఊకె జోగి, బాడిషె భియా అలియాస్ మహేష్, ముచ్చకి జోగిలు ఉన్నట్లు ఎస్పీ వివరించారు.
ఎస్పీ డాక్టర్ శబరీశ్