
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ఏటూరునాగారం: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు బి.రాజు ఆధ్వర్యంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన నాగరాజు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల జీపీఎఫ్, సరెండర్, లీవుల బిల్లులు ఏళ్లు గడిచినా విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే విధంగా 2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం చెల్లించి వారికీ పేస్కేల్ వర్తింపజేయాలన్నారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూక్యా సారంగపాణి, మండలం నాయకులు కానుగంటి సతీశ్, తాళ్లపల్లి మాధవి, సీహెచ్ పద్మ శ్రీ పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పల్లె నాగరాజు