జిల్లాలో 2,980 మంది దరఖాస్తులు
బ్యాంకుల ఎంపిక, ఇంటర్వ్యూలు పూర్తి
స్వయం ఉపాధి యూనిట్ల కోసం
నిరుద్యోగుల ఎదురుచూపు
ములుగు రూరల్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం ప్రవేశపెట్టింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కానీ పథకం అమలు చేయడంలో జాప్యం చేస్తుంది. జూన్ 2వ తేదీన పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో హడావుడిగా నిరుద్యోగ యువత నుంచి అధికారులు దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో స్వీకరించారు. నిరుద్యోగులు వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు అందించారు. ఈ క్రమంలో ఎంపీడీఓలు లబ్ధిదారులకు బ్యాంకుల ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూలు నిర్వహించారు. యూనిట్లు త్వరలోనే మంజూరు అవుతాయని ఎదురుచూస్తున్న క్రమంలో ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడంతో యువత నిరాశకు గురువుతుంది.
2,980 మంది దరఖాస్తులు
జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 2,980 మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 608 మంది, ఎస్టీ కార్పొరేషన్‌కు 1200, మైనార్టీ కార్పొరేషన్‌కు 96, క్రిస్టియన్ మైనార్టీ 1, బీసీ కార్పొరేషన్‌కు 817, ఈబీసీ వెల్పేర్‌కు 67, వాషర్‌మ్యాన్ కార్పొరేషన్ సొసైటీకి 11, నాయీబ్రాహ్మణ కో ఆపరేటీవ్‌సొసైటీకి 3 దరఖాస్తులు అందాయి. అలాగే వడ్డెర కో ఆపరేటీవ్ సొసైటీకి 1, సగర కో ఆపరేటీవ్ సొసైటీకి 1, క్రిష్ణబాలాజీ కో ఆపరేటీవ్ సొసైటీకి 2, కమ్మరి శాలివాహన కో ఆపరేటీవ్ సొసైటీకి 7, విశ్వబ్రాహ్మణ కో ఆపరేటీవ్ సొసైటీకి 24, మేదర కో ఆపరేటీవ్ సొసైటీకి 2, టాడి సొసైటీకి 15, గంగపుత్ర కో ఆపరేటీవ్ సొసైటీకి 40, పెరిక సొసైటీకి 32, ముదిరాజ్ కో ఆపరేటీవ్ సొసైటీకి 21, మున్నురుకాపు కో ఆపరేటీవ్ సొసైటీకి 28, గొల్ల కురుమ కో ఆపరేటీవ్ సొసైటీకి 29 దరఖాస్తులను నిరుద్యోగులు అందించారు.
ఉపాధి కల్పించాలి..
ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. బీసీ కార్పొరేషన్ నుంచి రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నా. వెల్డింగ్ దుకాణం ఏర్పాటుకు రూ.4 లక్షల యూనిట్ ఎంపిక చేసుకున్నా. ప్రభుత్వం సబ్సిడీ రుణం అందిస్తే స్వయం ఉపాధితో కుటుంబాన్ని పోషించుకుంటాను. ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ మంజూరు పత్రాలను తక్షణమే అందించాలి.
– బైకాని మహేందర్, శ్రీనగర్, మల్లంపల్లి మండలం
తక్షణమే అమలు చేయాలి..
డిగ్రీ వరకు చదువుకున్నాను. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. స్వయం ఉపాధి పథకంలో పెళ్లి డెకరేషన్ వేసేందుకు రూ. 4 లక్షల యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూకు హాజరయ్యాను. బ్యాంక్ సిబిల్ స్కోర్ పరిశీలించి అర్హత ఉందని గుర్తించారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నాను. రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేసి ఆదుకోవాలి.
– బల్లూరి ప్రభాకర్, మదనపల్లి
యూనిట్ల విభజన ఇలా..
రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని కేటగిరీల వారీగా విభజించి విడతల వారీగా యూనిట్లు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేటగిరి 1లో రూ.50 వేలు, కేటగిరి 2లో రూ.1లక్ష వరకు ఉన్న యూనిట్లను ఎంపిక చేసి మొదటి విడతలో అందించాలి. కేటగిరి 3లో రెండు లక్షలు, కేటగిరి 4లో రూ.4లక్షలు, కేటగిరి 5లో రూ.5లక్షల కంటే పైబడిన యూనిట్లను విభజించారు.