టూర్ ప్యాకేజీని వినియోగించుకోవాలి
ములుగు రూరల్: జిల్లాలోని రామప్ప, బొగత, మల్లూరు పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచరామాలు వెళ్లేందుకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసిందని వరంగల్ –2 డిపో మేనేజర్ జ్యోత్స్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామప్ప, బొగత, మల్లూరు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.530, పంచరామాలు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.2300 చార్జి తీసుకుంటున్నామని అన్నారు. పూర్తి వివరాల కోసం 99592 26048, 90634 52131, 93465 54351 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు.
దరఖాస్తు చేసుకోండి
వాజేడు: ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కోర్సులలో చేరడం కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వాజేడు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పి.శేఖర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి గాను 10వ తరగతి పాసైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్‌లైన్ చేసే సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 21వరకు గడువు ఉందని ఆ లోగా తప్పనిసరిగా ఆన్‌లైన్ చేసుకోవాలని సూచించారు.
మౌలిక వసతులు కల్పించాలి
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పారు. జిల్లాకేంద్రంలో గిరిజన యూనివర్సిటీకి భూములు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి గిరిజన యూనివర్సిటీ పనులను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్, దిలీప్, రాజ్‌కుమార్, వేణు, శరత్, నవీన్, రమేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.
రేపటినుంచి లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లా కోర్టు ఆవరణలో జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి సీఐ నరేష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో వివిధ కారణాలతో కేసుల పాలైన వారు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇరువర్గాలు హాజరై సంబంధిత కేసులను తొలగించుకోవాలని సూచించారు.
రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
కన్నాయిగూడెం: మండలంలో బాండ్ పేరుతో రైతులను మోసం చేసిన మొక్కజొన్న కంపెనీలు రైతుల అకౌంట్‌లలో తక్షణమే డబ్బులు జమ చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి అన్నారు. రైతు సంఘం మండల అధ్యక్షుడు కావిరి నాగయ్య అధ్యక్షతన శనివారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వెంకట్‌రెడ్డి హాజరై మాట్లాడారు. సోమవారం వరకు డబ్బులు జమ చేయకుంటే రైతులను సమీకరించి ఆందోళన చేస్తామన్నారు. నకిలీ విత్తనా ల క్రయ విక్రయాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, తోకల రవి, సురేష్, పాషా, రామారావు, లక్ష్మిపతి, మధు, రవీందర్, పాపారావు, రాజబాబు, రఘుపతి, శ్రీను, మహేష్ పాల్గొన్నారు.
గీత కార్మికుడికి తీవ్రగాయాలు
చిట్యాల: మండలంలోని జడల్‌పేట గ్రామానికి చెందిన బయగాని సమ్మయ్య వృత్తిలో భాగంగా శుక్రవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి తలకు తీవ్రంగా గాయమైంది. తోటి కార్మికులు 108లో వరంగల్‌కు తరలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
టూర్ ప్యాకేజీని వినియోగించుకోవాలి


