వాగులో డ్రిల్లింగ్‌ పనులు షురూ.. | - | Sakshi
Sakshi News home page

వాగులో డ్రిల్లింగ్‌ పనులు షురూ..

May 26 2025 1:13 AM | Updated on May 26 2025 1:13 AM

వాగుల

వాగులో డ్రిల్లింగ్‌ పనులు షురూ..

ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి బ్రిడ్జి వద్ద నిర్మించబోయే హైలెవల్‌ బ్రిడ్జి పనుల నిమిత్తం వాగులో పిల్లర్ల కోసం డ్రిల్లింగ్‌ పనులు ఆదివారం ప్రారంభించారు. ఈ పనులు సకాలంలో పూర్తి కావాలని కోరుతూ కొండాయి, మల్యాల గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద మీనయ్య మాట్లాడుతూ జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ప్రజల కోరుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్‌ పనులు వేగంగా, నాణ్యతగా పూర్తిచేయాలని కోరారు.

ఆపరేషన్‌ కగార్‌ను

నిలిపివేయాలి

ఏటూరునాగారం: కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదివాసీ గిరిజన మహిళా జిల్లా నాయకురాలు సరిత ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కర్రెగుట్టల్లో కాల్పులు జరుపుతున్న పోలీసులు అమాయకులైన గిరిజనులను హతమార్చడం సరికాదని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో అత్యంత ఖనిజ నిల్వలు ఉండడంతో వాటిని తవ్వడానికి మావోయిస్టులు అడ్డు తగులుతారని ఉద్దేశంతో వారిని మట్టుపెడుతున్నారని వివరించారు.

ఓడ బలిజలకు

ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ఓడ బలిజలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని సంఘం రాష్ట్ర కోశాధికారి బోట రమణయ్య, మండల అధ్యక్షుడు వీరన్న, కుల పెద్ద పోశాలు కోరారు. మండల కేంద్రంలోని ఓడవాడలో ఓడబలిజ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆదివారం ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఓడ బలిజలకు చేపలు పట్టేందుకు వలలు, బోట్లు, బైక్‌లు ఇవ్వాలని తెలిపారు. అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పానెం సాంబశివరావు, కర్ల శ్రీనివాస్‌, బోట తిరుపతమ్మ, గార మల్లయ్య, రమేష్‌, వంశీ, చందు, సంతోష్‌, మహేష్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటితో ముగియనున్న

పుష్కరాలు

కాళేశ్వరం: మే 15నుంచి 26వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సరస్వతీ నది పుష్కరాలు (నేడు) సోమవారంతో ముగియనున్నాయి. సోమవారం ముగింపు కార్యక్రమాలను సాయంత్రం 6గంటల నుంచి నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తుంది. సుమారు వందకుపైగా డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరణలు, భారీగా క్రాకర్స్‌ పేల్చి సంబురాలు జరుపనున్నట్లు తెలిసింది. ఇప్పటికే అవతలి తీరం వైపునకు బోటులో జనరేటర్‌, తదితర సామగ్రి తరలి వెళ్లినట్లు తెలిసింది.

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

గణపురం: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఆది వారం స్టేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూటర్‌ సత్యనారాయణస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు జూలపల్లి నాగరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి గాయాలు

రేగొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన మండలంలోని రూపిరెడ్డిపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన కొండ్ల వేణు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వ్యక్తిగత పనుల నిమిత్తం పరకాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జూకల్‌ నుంచి పరకాలకు వెళ్తున్న ఆటో రూపిరెడ్డిపల్లి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో వేణుతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న బొల్లికొండ శివవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంత్రి సీతక్క తన కాన్వాయ్‌ను ఆపి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

వాగులో డ్రిల్లింగ్‌  పనులు షురూ..
1
1/1

వాగులో డ్రిల్లింగ్‌ పనులు షురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement